పక్షం రోజుల కిందటి వరకు కరోనా రోగులతో కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూవారీ డిశ్చార్జి అయ్యే రోగుల సంఖ్య భారీగా పెరగుతుండటం.. కొత్తగా వచ్చేవారి సంఖ్య తగ్గడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గాంధీలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో కలుపుకుంటే 2,250 పడకలున్నాయి. 20 రోజుల కిందటి వరకు ఈ ఆస్పత్రిలో ఒక్కటి కూడా ఖాళీగా లేవు. మూడు నుంచి నాలుగు గంటలపాటు అంబులెన్సులో రోగులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. కాగా వారం రోజులుగా గాంధీకి వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గిందని వైద్యాధికారులు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ప్రతిరోజూ వందమందికిపైగా డిశ్చార్జి అవుతుండగా.. కొత్తగా 100 మందికిపైగా కరోనా రోగులు చేరుతున్నారు. అయినప్పటికీ ఆ ఆస్పత్రిలో నిత్యం 50 ఆక్సిజన్ పడకలు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో గాంధీకి వచ్చిన రోగులందరినీ అరగంటలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు.
టిమ్స్‌లో అన్ని రకాల పడకలు 100-150 వరకు ఖాళీగానే ఉంటున్నాయి. కింగ్‌కోఠి, ఛాతి, ఫీవర్ ఆస్పత్రుల్లో కూడా పడకలు ఖాళీ అవుతున్నాయి. నగరంలో నాలుగైదు ప్రైవేటు ఆస్పత్రులు మినహా మిగిలిన వాటిలో 40 శాతం ఆక్సిజన్, ఇతర పడకలు దొరుకుతున్నాయి. ప్రాథమిక దశలోనే ఆస్పత్రిలో చేరడం వల్ల వారంలోనే కోలుకుంటున్నారు. దీనివల్ల మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
తొందరగా కోలుకుని వెళ్తున్నారు
గాంధీలో ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు ఖాళీ అవుతున్న మాట వాస్తవమే. రోగుల సంఖ్య తగ్గడమే కారణం. చేరుతున్న రోగులు కూడా తొందరగా కోలుకుంటున్నారు. వెంటనే ఆస్పత్రిలో చేరడం వల్ల చాలా మంది వెంటిలేటర్ వరకు వెళ్లకుండా సాధారణమవుతున్నారు.
- డాక్టర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్
ఇదీ చదవండి: WEATHER REPORT: హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీవర్షం