రాష్ట్రంలో కొత్త జోనల్ (new zonal system in telangana) విధానం అమలు ప్రక్రియలో ముందడుగు పడటం లేదు. ఇప్పటివరకు జిల్లా, జోనల్, బహుళ జోనల్‌్ వారీగా ఉద్యోగుల విభజన మాత్రమే జరగగా, ఉద్యోగుల సంఖ్య ఖరారులో, జోన్ల వారీగా బదలాయింపుల్లో జాప్యం జరుగుతోంది. దాంతో కొత్త నియామకాల ప్రక్రియ ముందుకుసాగని పరిస్థితి నెలకొంది (waiting for new zonal system). 33 జిల్లాలకు సంబంధించి కొత్త జోనల్ విధానానికి కేంద్రం గత ఏప్రిల్ 19న ఆమోదం తెలిపింది. దానికి అనుగుణంగా జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆగస్టు 6న ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, అధికారుల పోస్టుల వర్గీకరణను పూర్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, ఆయా శాఖల్లోని పోస్టులను జిల్లా (లోకల్), జోనల్, బహుళ జోన్ కేడర్ వారీగా గుర్తించింది. జోనల్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి తోడు ఉద్యోగాల నియామకాల కోసం విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో కమిటీని నియమించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఉద్యోగుల సంఖ్య ఖరారుకు తకరారు
కేడర్ ఖరారు కావడంతో ప్రభుత్వం జిల్లాలు, శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)ను నిర్ణయించాల్సి ఉంది. జనాభా, మండలాలు, నియోజకవర్గాలు, శాఖల విస్తృతిని ప్రామాణికంగా తీసుకొని ఈ సంఖ్య ఖరారు చేయాలని ఉద్యోగ, అధికారుల సంఘాలు కోరాయి. అయితే ఉమ్మడి జిల్లాల్లోని ఉద్యోగులనే విభజించిన జిల్లాలకు పంపకాలు చేసి నిర్ధారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి.
బదలాయింపులు ఎలా?
ఉద్యోగుల సంఖ్య ఖరారు తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తేలుతుంది. వాటిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులుగాక మిగిలిన వారిని కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. ఉద్యోగుల బదలాయింపుల కోసం ఉమ్మడి జిల్లా యూనిట్‌గా వారి వారి సొంత జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపైనా సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. అలాకాకుండా ఉద్యోగులకు ఐచ్ఛికాలు కల్పించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివల్ల అందరూ జిల్లా కేంద్రాలు, పట్టణాలనే కోరుకుంటారని భావిస్తున్న ప్రభుత్వం అంగీకరించడం లేదు. మరోవైపు బదిలీ స్థానాల్లో సీనియారిటీ నిర్ధారణపైనా సందిగ్ధం నెలకొంది.
నియామకాలకు లంకె
జోనల్ విధానంలో ఉద్యోగుల సంఖ్య, ఖాళీల నిర్ధారణ, జోనల్ బదలాయింపుల అనంతరమే కొత్త నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇతర అంశాలన్నీ పూర్తిగాక నియామకాలకు మోక్షం లభించడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడానికి యోచిస్తున్నారు.
ముఖ్యమంత్రి సమావేశంలో అన్నింటికీ¨ పరిష్కారం: మామిళ్ల రాజేందర్
టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ స్పందిస్తూ.. ‘జోనల్ విధానం అమలుపై సీఎం కు స్పష్టత ఉంది. ఆయన ఆదేశాలను అమలు చేస్తే సత్వరమే పూర్తవుతుంది. అధికారులే వెనుకాడుతున్నారు. సీఎంతో సమావేశంలో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది’ అని తెలిపారు.
టీఎన్జీవో, టీజీవోలతో సీఎస్ చర్చలు
కొత్త జోనల్ విధానం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, టీఎన్జీవో, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మమత, రాయకంటి ప్రతాప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ విధానం అమలు, సమస్యలు, ఇతర అంశాలను సీఎస్‌కు, ఉద్యోగ సంఘాల నేతలకు అధికారులు వివరించారు. రాజేందర్, మమతలు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రయోజనాల కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో కొత్త జోనల్ విధానం తెచ్చారని, అది పూర్తిస్థాయిలో అమలయితే అద్భుతాలు జరుగుతాయన్నారు. దాని కోసం అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలు, శాఖల వారిగా ఉద్యోగుల సంఖ్యను సత్వరమే ఖరారు చేయాలని, ఆ వెంటనే జోనల్ ప్రాతిపదికన ఉద్యోగులకు ఐచ్ఛికాలిచ్చి బదిలీ చేయాలని కోరారు.
ఇదీ చూడండి: Ts health minister: వైద్యారోగ్యశాఖపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష