అన్నీ విమానాశ్రమానికే
‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్’ సంస్థతో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా 40 బస్సులు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ వివిధ మార్గాల్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరనున్నాయి. రూట్ నంబర్ వన్‌లో జేబీఎస్ నుంచి బయలుదేరి సంగీత్, ఉప్పల్, చంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరతాయి. రెండో రూట్లోని బస్సులు సంగీత్, ట్యాంక్ బండ్, మాసాబ్‌ట్యాంక్, పీవీఆర్ మీదుగా చేరుకుంటాయి. మూడో రూట్ లో జేబీఎస్ నుంచి బేగంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, ఓఆర్ఆర్ మీదుగా పరుగులు పెట్టనుండగా... నాలుగో రూట్ లోని బస్సులు ఎంజీబీఎస్ నుంచి హైకోర్ట్, పురాణాపూల్, ఆరాంఘర్ మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి. ఐదోరూట్లోని బస్సులు మియాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలీ మీదుగా... ఆరో రూట్లో బీహెచ్ఈఎల్, అల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటాయి. రూట్ నం.5, 6లలో ఓల్వా బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
ఆర్టీసీకి భారీగా ఆదా
వీటికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300ల నుంచి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. బ్యాటరీతో నడిచే ఈ బస్సులను మూడు నుంచి మూడున్నర గంటలు ఛార్జింగ్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీజిల్‌తో నడిచే బస్సులతో పోలిస్తే విద్యుత్ బస్సులతో కిలోమీటరుకు 21 రూపాయల వరకూ ఆదా అవుతోందని సంస్థ అంచనా వేస్తోంది. 40 బస్సులతో సగటున ఏడాదికి 10 కోట్లు ఆదా అవుతుందని లెక్కలేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోలో 20, మియాపూర్ డిపోలో 20 బస్సులు నడపనున్నారు.విద్యుత్ బస్సులతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఆర్టీసీ నష్టాలను పూడ్చుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్ బస్సులు సంస్థకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.
ఇవీ చదవండి:సాఫ్ 'హై'దరాబాద్