ఈవీఎంల్లో నిక్షిప్తమైన ప్రజల తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన రాష్ట్రంలో తొలిదశలోనే పోలింగ్ పూర్తైంది. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో కోటీ 86 లక్షలా 17వేలా 91 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 62.69 శాతం ఓటింగ్ నమోదైంది.
తేలనున్న 443 మంది అభ్యర్థులు భవితవ్యం
17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 418 మంది పురుషులు కాగా... 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా తరఫున అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీ చేయగా... బీఎస్పీ నుంచి ఐదుగురు, సీపీఐ, సీపీఎం నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు, మజ్లిస్ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో నిలిచారు. ఇందులో 178 మంది రైతులే కావడం విశేషం. అత్యల్పంగా మెదక్‌లో పది మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.
18 జిల్లాలో 35 కేంద్రాలు
ఓట్ల లెక్కింపులో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ఒకే ప్రాంగణంలో జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఓట్లను ఒక్కో కేంద్రంలో లెక్కిస్తారు. మొత్తం 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు.
టేబుల్ వద్ద ఎవరుంటారు..?
ఓట్ల లెక్కింపు కోసం ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ప్రతి సెగ్మెంట్లోనూ ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంటారు. వీరితో పాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు విధుల్లో ఉంటారు. మొత్తంగా 20వేల మంది లెక్కింపు ప్రక్రియలో పాల్గోనున్నారు.
ఓట్లను ఎలా లెక్కిస్తారు....?
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ విధానంలో వచ్చిన సర్వీసు ఓటర్ల బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎంల లెక్కింపు చేపడతారు. ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి చివర్లో అందులోని స్లిప్పులను లెక్కిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్పులలో వేర్వేరు ఫలితాలు వస్తే వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణలోకి తీసుకుంటారు.
ఇవీ చూడండి: ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ