కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో జాబితా తయారీ ప్రక్రియ జరుగుతోంది. అందుకు అనుగుణంగా నవంబర్ 16న ముసాయిదా ప్రచురించారు. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మూడు కోట్ల 55 వేల 327 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు కోటీ 51లక్షల 1236 కాగా.. మహిళలు కోటీ 49 లక్షల 49వేల 876 మంది ఉన్నారు. ఇతరులు 1598 మంది ఓటర్లుగా ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య 2617.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 42 లక్షల 70 వేల 614 మంది ఓటర్లు ఉన్నారు. 30 లక్షల 54వేల 338 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం రెండు లక్షల 13వేల 794 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఆరు లక్షల 33 వేల 474 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో లక్ష 43 వేల 514 ఓట్లు ఉన్నాయి. ఈసీ ప్రకటించిన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతులకు ఈ నెల 15 వరకు గడువుంది. 2021 జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల జాబితా
మార్చి నెలలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కూడా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. డినోవా పద్ధతిన ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాపై నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం ఉంది. వాటిని పరిష్కరించి జనవరి 18న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రక్రియ.. వారం రోజులు ఆలస్యమైంది. నియోజకవర్గంలో ఈ నెల 8న ముసాయిదా జాబితా ప్రకటించారు. జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.
ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల తుది జాబితా ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారు. మార్చి 29తో ఇద్దరు ఎమ్మెల్సీల గడువు పూర్తవుతున్నందున... ఆ లోగా ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి ఒకటి లేదా రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: తండ్రి లేని అమ్మాయికి పెళ్లి పీటలపైనే కల్యాణలక్ష్మి సాయం