Election Campaign in Telangana : ప్రజా ఆశీర్వాద సభలతో ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళుతుంటే.. అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారాల జోరు పెంచారు. గడప గడపకు తిరుగుతూ.. ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి తలసాని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రేపట్నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ప్రచారం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ టికెట్ పొందిన ఆరూరి రమేశ్.. గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి కార్యకర్త ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య వాడ వాడ తిరుగుతూ ప్రచారం చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని కోరారు.
"కేసీఆర్ ఏదైనా చెప్తే చేసి చూపించారు. కాబట్టి ఏదైతే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయో.. రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం వృద్ధుల కోసం ప్రకటించిన పింఛన్, బీమా పథకాలు, గ్యాస్ సిలిండరు ఇవన్నీ ప్రజల కోసమే. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ వస్తారు" - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
Congress Election Campaign : బుధవారం నుంచి రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్న నేపథ్యంలో.. పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు వివరిస్తూ జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. బస్సు యాత్రతో పార్టీ నాయకుల్లో మరింత జోష్ పెరుగుతుందని అధిష్ఠానం భావిస్తోంది. కాగా ఈ బస్సు యాత్రతో వీలైనంత వరకు సభలు, కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు.
Election Campaign Vehicles Being Prepared : ఊపందుకున్న ఎన్నికల ప్రచార పర్వం.. సిద్ధమవుతున్న రథాలు
BJP Campaign : బీజేపీ సైతం ఎన్నికల ప్రచార జోరు పెంచింది. సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్ పల్లి ఎల్లమ్మ ఆలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర నాయకులతో సమావేశాలు ప్లాన్ చేస్తోంది. కేంద్రంలో.. రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే.. కలిగే లాభాల గురించి విస్తారంగా ప్రచారం చేస్తుంది.
తెలుగుదేశం పార్టీ సైతం ప్రచార బరిలో దిగింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డివిజన్‌లో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ నేత ఎస్వీ కృష్ణా.. జెండా ఆవిష్కరించారు. అనంతరం ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. 'ఇంటింటికి తెలుగుదేశం ' కార్యక్రమంలో భాగంగా 11 రోజులపాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్‌లలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
నోటు ఇవ్వండి .. ఓటు వేయండి అంటూ... మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇల్లందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అనురాధ పోటిచేయనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇల్లందులో స్వచ్ఛ రాజకీయాలు ఉండాలని.. అవినీతిని ఓడించి న్యాయాన్ని గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'