విద్యారంగం 2020లో తీవ్ర ఒడుదొడుకులకులోనైంది. చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తైనప్పటికీ... లాక్‌డౌన్‌తో మూల్యాంకన ప్రక్రియ మధ్యలో నిలిచింది. సడలింపులు ఇచ్చాక మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులతో పాటు పరీక్షకు హాజరు కాని వారిని కూడా ప్రభుత్వం పాస్ చేసింది. పదో తరగతి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగియగానే లాక్డౌన్ విధించారు. పరీక్షలను పూర్తిగా రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులను చేశారు.
పరీక్షలు లేకుండానే...
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ గగనమైంది. కరోనా పరిస్థితులు, హైకోర్టులో కేసుల కారణంగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పాలిసెట్ తదితర ఎంట్రెన్సులను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు జేఈఈ, నీట్‌కు పచ్చజెండా ఊపగా... రాష్ట్రంలోనూ ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఇతర కోర్సుల్లో చివరి సెమిస్టర్ మినహా మిగతా సెమిస్టర్ల పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు చివరి సెమిస్టర్ పరీక్షలను ఆఫ్‌లైన్ పద్ధతిలోనే పూర్తి చేయగలిగారు. కొన్నింటి ఫలితాలను వెల్లడించగా.. మరికొన్ని ఇంకా రావల్సి ఉంది.
ఇళ్లే విద్యాలయం...
విద్యా సంవత్సరం కొనసాగింపు సవాల్‌గా మారింది. కరోనా పరిస్థితుల్లో ఇళ్లే విద్యాలయంగా మారింది. కార్పొరేట్ విద్యా సంస్థలు జూన్ నుంచే ఆన్లైన్ విద్యా బోధనను ప్రారంభించాయి. మొదట్లో విద్యార్థులు కొంత తడబడినప్పటికీ... క్రమంగా అలవాటు పడ్డారు. విద్యాసంస్థలు తెరవనప్పటికీ ప్రైవేట్ సంస్థలు ఆన్లైన్ పాఠాలతో భారీగా ఫీజులు వసూలు చేయడం వివాదంగా మారింది.
డిజిటల్ విద్యకు దూరం...
గ్రామీణ, పేద విద్యార్థులు మాత్రం డిజిటల్ పరికరాలు, ఇంటర్నెట్ సదుపాయం లేక ఇప్పటికీ ఆన్లైన్ బోధన అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెబుతున్నప్పటికీ... విద్యార్థులకు అర్థం కావడంలేదని తల్లిదండ్రులు అంటున్నారు.
ఇంటర్ బోర్డుతో పాటు విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ బోధనతోనే విద్యాసంవత్సరాన్ని ప్రకటించాయి. పాఠశాల విద్య తీవ్రంగా దెబ్బతింది. ఓ వైపు ఆన్లైన్ విధానాన్ని విద్యార్థులు పూర్తిగా అందుకోలేకపోగా... మరోవైపు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ విద్యాసంవత్సరాన్ని ప్రకటించలేదు.
పునరుద్ధరణపై సందిగ్ధత...
విద్యా సంస్థల పునరుద్ధరణపై సందిగ్ధత నెలకొంది. సంక్రాంతి తర్వాత 9,10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో భౌతికంగా తరగతులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదో తరగతి వరకు ఈ ఏడాది దాదాపు భౌతిక తరగతులు ఉండని పరిస్థితి కనిపిస్తోంది. లక్ష మందికి పైగా ప్రైవేట్ ఉపాధ్యాయలు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పార్ట్ టైం ఉపాధ్యాయులు, విద్యావాలంటీర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్లే స్కూల్స్, చిన్న పాఠశాలలు కొన్ని మూతపడగా... మరికొన్ని ఆ దిశలో ఉన్నాయి.
చతికిలపడ్డ గురుకుల విద్య...
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న గురుకుల విద్య ఈ ఏడాది చతికిలపడిపోయింది. ఆన్లైన్, టీశాట్, దూరదర్శన్‌తో పాటు కొన్ని చోట్ల గ్రామాలకే వెళ్లి విద్యార్థులకు బోధించేలా ప్రయత్నాలు చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించాయి. ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి.
పెద్ద సవాల్...
వైద్యవిద్యకు 2020 పెద్దసవాల్‌గా పరిణమించింది. కొవిడ్‌తో వైద్య కళాశాలలు మూతపడ్డాయి. వైద్య విద్యార్థులకు కూడా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి అత్యంత ముఖ్యమైన ప్రాక్టికల్స్‌కు అవకాశం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో స్టెప్పులేసిన జేసీ