సీబీఎస్ఈ బాటలోనే రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదోతరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్‌బోర్డు, ఎస్సెస్సీ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ సమావేశమయ్యారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులు చర్చిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం ఉండగా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆన్‌లైన్ తరగతులు, పనిదినాలను ఈనెల 30 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. విద్యా క్యాలెండర్ ప్రకారం ఇంటర్ పని దినాలు, ఆన్‌లైన్ తరగతులు నేటితో ముగియనున్నాయి. విద్యార్థులు-పర్యావరణం, విలువల అసైన్‌మెంట్లు సమర్పించాల్సి ఉన్నందున పనిదినాలు పొడిగిస్తున్నామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాకు ప్రతిపాదనలు చేసిన దస్త్రాన్నిముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. సీఎం ఆమోదం అనంతరం పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది.