ED Notices To Telangana Congress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అక్టోబరులో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్ననాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం దిల్లీకి పిలిపించింది. ఈడీ విచారణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేసు పూర్వాపరాలపై అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం వీరితో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కేసును చూస్తున్న న్యాయవాదులు, ఆడిటర్లు సమావేశమై కేసుకు చెందిన వివరాలను తెలియచేస్తారు.
నిన్ననే ఏఐసీసీ కార్యదర్శుల నుంచి నోటీసు అందుకున్న నేతలు దిల్లీకి రావల్సిందిగా పిలుపు వచ్చింది. దీంతో నిన్ననే కొందరు దిల్లీకి వెళ్లగా.. ఈరోజు ఉదయం కొందరు వెళ్లారు. దిల్లీకి వెళ్లిన వారిలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన నాయకుల్లో కొందరికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. తామంతా చెక్కు రూపంలోనే విరాళాలు ఇచ్చామని నోటీసులు ఇస్తే.. విచారణకు హాజరై సమాధానం చెబుతామని నోటీసులు అందుకున్న నేతలు స్పష్టం చేస్తున్నారు. అక్టోబరు 3వ తేదీ నుంచి నోటీసులు అందుకున్న వారు.. వారికి నిర్దేశించిన తేదీల్లో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వారికి అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇవీ చదవండి: భాగ్యనగరంలో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఆపరేషన్ రోప్‌తో!