Chikoti Praveen at ED Office: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌కు నాలుగో రోజు ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని చీకోటి ప్రవీణ్ అన్నారు. తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చీకోటి తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానన్నారు. క్యాసినో నిర్వహించా.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. గోవా, నేపాల్‌లో చట్టబద్ధంగా నడుస్తున్న చోటికి ఇక్కడి నుంచి పలువురిని తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని తెలిపారు. ఈడీ విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తానని చీకోటి ప్రవీణ్ తెలియజేశారు.
"నాపై పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాం. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారి గురించి భయపడేది లేదు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మనివాళ్లు నమ్మరు. నాకు చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు , వ్యాపారవేత్తలతో నాకు పరిచయముంది." -చీకోటి ప్రవీణ్
అసలేం జరిగిదంటే: చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఈడీ లోతుగా విచారిస్తోంది. కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాడని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ట్రూప్ బజార్‌లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్.. అనతి కాలంలోనే రూ.కోట్లు సంపాదించడం వెనుక కారణాలు ఆరా తీస్తున్నారు. గోవా క్యాసినోలో ఏజెంట్‌గా గడించిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఐదు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు. క్యాసినోల నిర్వాహణతో రూ.కోట్లు చేతులు మారుతుండటంతో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా మార్గంలో ద్రవ్యమారకం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. ఆ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి : భవిష్యత్ కార్యాచరణపై రాజగోపాల్‌రెడ్డి ఫోకస్.. నేడు దిల్లీకి పయనం
వేతన జీవులపై మరో పిడుగు.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం