ED raids in Hyderabad today: హైదరాబాద్‌లోని రాయదుర్గం, మాదాపూర్, దోమలగూడ, డీడీ కాలనీతో పాటు పలు చోట్ల ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నెలరోజుల్లో మూడోసారి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం క్రితం ఈడీ అధికారులు ఐదుచోట్ల తనిఖీలు నిర్వహించి పలు బ్యాంకు ఖాతాల వివరాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
వాటిలో లభించిన ఆధారాలను బట్టి ఈ రోజు ఏకంగా 25చోట్ల సెర్చ్ నిర్వహించారు. రాయదుర్గంలోని జయభేరీ ఫైన్ విల్లాస్, మాదాపూర్‌లోని అనూస్ బ్యూటీ క్లినిక్ కార్యాలయం, దోమలగూడలోని గోరంట్ల అసోసియేట్, అంబర్ పేట్ డీడీ కాలనీలోని ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉదయం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి బయల్దేరిన ఈడీ అధికారులు ఇది వరకే సేకరించి పెట్టుకున్న చిరునామాల వద్దకు చేరుకున్నారు.
సీఆర్పీఎఫ్ సిబ్బందిని వెంట పెట్టుకొని సోదాలకు సంబంధించిన నోటీసులను సదరు యజమానులకు చూపించారు. రాయదుర్గంలోని జయభేరీ ఫైన్ విల్లాస్‌లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. సంబంధిత వ్యక్తికి చెందిన పలు బ్యాంకు వివరాలు సేకరించారు. దోమలగూడలోని శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలోనూ చార్టెడ్ అకౌంట్స్ గురించి వివరాలు సేకరించారు. దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిల్లై ఇంట్లో ఈడీ అధికారులు గతంలోనూ సోదాలు చేశారు. గండ్ర ప్రేమ్ సాగర్, అభిషేక్ బోయిన్‌పల్లిలు డైరెక్టర్లుగా ఉన్నారు. అభిషేక్ బోయిన్ పల్లి అనూస్ బ్యూటీ పార్లర్లకు సైతం డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ అధికారులు అనూస్ బ్యూటీ పార్లర్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 25చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు కొన్ని చోట్ల పత్రాలు తీసుకొని కార్యాలయానికి వెళ్లారు. మరికొన్ని చోట్ల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
ఈడీ అధికారులు సేకరించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలన్నింటిని పరిశీలించిన తర్వాత అందులో అనుమానాస్పదంగా కనిపించే లావాదేవీలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.దిల్లీకి చెందిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లో మకాం వేసి లిక్కర్ స్కాంకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. సీజ్ చేసిన పత్రాలు, ల్యాప్ టాప్ లు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: