Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. 4 రోజుల పాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన ఈడీ అధికారులు.. అతని వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ ఇచ్చిన వివరాలను విశ్లేషిస్తున్నారు. విచారణలో గత 10ఏళ్లుగా విదేశీ ప్రయాణ వివరాలు ఈడీ అధికారులు సేకరించారు. ఏయే దేశాలు వెళ్ళారు. ఏ పనులపై వెళ్లారు. అక్కడ చేసిన లావాదేవీలు.. విదేశాలకు వెళ్లే ముందు ఇక్కడ చేసిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారించింది.
ఇప్పటి వరకూ ఫైల్ చేసిన ఆదాయపు పన్ను వివరాలు సేకరించిన ఈడీ అధికారులు.. చికోటి ప్రవీణ్‌తో పాటు అతని బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. ప్రవీణ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు.. డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపై అతణ్ని ఈడీ ప్రశ్నించింది. విచారణలో తనకు ఎలాంటి కంపెనీలు లేవని.. చికోటి ప్రవీణ్ ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలతో పాటు.. స్థిర చరాస్తుల వివరాలు ఈడీ అధికారులు సేకరించారు. వీటితో పాటు.. అతని పాస్ పోర్ట్ వివరాలు తీసుకున్న ఈడీ ఆధికారులు.. సేకరించిన వివరాలను విశ్లేషిస్తున్నారు. ఇదే తరహాలో క్యాసినో ఏజెంట్‌గా ఉన్న మాధవరెడ్డి వద్ద కూడా.. పలు ఆధారాలను ఈడీ సేకరించింది.
క్యాసినో ద్వారా భారీగా నగదును విదేశాలకు పంపి.. అక్కడి నుంచి హవాలా రూపంలో డబ్బును దేశానికి రప్పించారని... ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారని విచారణకు హాజరు కావాలంటూ గత నెల ఈడీ.. చికోటికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల ఒకటి నుంచి బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో చికోటి ప్రవీణ్ తో పాటు.. మాధవరెడ్డిని ఈడీ 4 రోజుల పాటు విచారించింది. ఇద్దరి నుంచి వివరాలను సేకరించిన అధికారులు .. వారు సేకరించిన ఆధారాలతో విశ్లేషిస్తున్నారు. బ్యాంకు లావాదేవీల వివరాలతో పోల్చుతూ... ప్రవీణ్ బృందం చెప్పే సమాధానాలను క్రోడీకరించుకున్నారు. ప్రవీణ్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో... ట్రావెల్ ఏజెంట్ సంపత్ కీలకంగా వ్యవహరించడంతో వారిద్దరూ చెప్పే సమాధానాలను పోల్చిచూశారు. క్యాసినోల నిర్వహణ ద్వారా.. కూడబెట్టిన కమీషన్ల సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని విచారించారు.