ED arrests gautam malhotra in Delhi liquor scam : దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. ఈ స్కామ్‌లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరొకరిని అరెస్టు చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను... ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయణ్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Delhi liquor scam Updates : ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సైతం సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు చెప్పారు. అనంతరం బుచ్చిబాబు అరెస్టును అధికారికంగా వెల్లడించారు. వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
MLC Kavitha in Delhi liquor scam: మరోవైపు ఈ స్కామ్ అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.
ఇండోస్పిరిట్ యజమాని సమీర్‌మహంద్రు.. కేజ్రీవాల్‌ని విజయ్‌నాయర్ వీడియోకాల్ ద్వారా మాట్లడించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. మద్యం కుంభకోణంలో భాగంగా సౌత్‌గ్రూప్ విజయ్‌నాయర్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూపులో భాగమని తెలిపింది. సమీర్ మహుంద్రుకు చెందిన ఇండోస్పిరిట్‌కు.. హోల్ సేల్ డీలర్ షిప్ ఇవ్వాలని మద్యం తయారీ సంస్థ పెర్నార్డ్ రిచర్డ్స్ సంస్థకు విజయ్‌నాయర్ స్పష్టం చేసినట్లు పేర్కొంది.
విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం కవిత.. మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత 3 కోట్ల 40 లక్షలు, మాగుంట 5కోట్లు ఇండో స్పిరిట్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. కవిత తరఫున అరుణ్‌పిళ్లై, మాగుంట తరఫున ప్రేం రాహుల్ ఇండోస్పిరిట్‌లో ప్రతినిధులుగా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. వితతో సమీర్ మహుంద్రు వీడియోకాల్ మాట్లాడటంతో పాటు.. హైదరాబాద్‌లో కలిశారని చార్జిషీట్‌లో ఈడీ వివరించింది.
కవిత ఆదేశాల మేరకు కోటి రూపాయలను అరుణ్ పిళ్లైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని పేర్కొంది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని.. సౌత్‌గ్రూపు ద్వారా వంద కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని అరుణ్ పిళ్లై చెప్పినట్లు వెల్లడించింది. దిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన చర్చల్లో కవిత పాల్గొన్నట్లు ఈడీ తెలిపింది. ఇండోస్పిరిట్‌కు వచ్చిన లాభాల్లో కోటి 70 లక్షలు మాగుంట గౌతమ్ తీసుకున్నట్లు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వివిధ పేర్లతో ఆరు రిటైల్ జోన్లను దక్కించుకున్నట్లు తెలిపింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాలు ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.
ఇవీ చదవండి: