రాష్ట్ర రాబడుల్లో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే నమోదైంది. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్ర రాబడులపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే డిసెంబర్ వరకు పన్నుల రాబడిలో కేవలం మూడున్నర శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది.
తగ్గిన జీఎస్టీ ఆదాయం..
వస్తుసేవల పన్ను ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. 2018లో రూ.22వేల 10 కోట్లు రాగా... ఈ ఏడాది రూ.31వేల 186 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకూ కేవలం రూ.20వేల 348 కోట్లు మాత్రమే వచ్చాయి. జీఎస్టీ ఆదాయం తగ్గినందున కేంద్రం నుంచి రాష్ట్రం పరిహారం పొందుతోంది.
అమ్మకం పన్నులో స్వల్ప పెరుగుదల ఉంది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో పోలిస్తే రూ.600 కోట్లు పెరిగింది. నిరుడు రూ.13 వేల 997 కోట్లు రాగా.. ప్రస్తుతం రూ.21వేల 972 కోట్ల అంచనాకు గాను రూ.14వేల 5 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల మాత్రం బాగానే ఉంది. నిరుడు ఎక్సైజ్ ఆదాయం రూ.7వేల 369 కోట్లు రాగా... ఈ ఏడాదికి రూ.10వేల 901 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.9వేల 32 కోట్లు వచ్చాయి.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా నిరుడు రూ.4వేల 70 కోట్లు రాగా ఈ ఏడాది రూ.6వేల 146 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.4వేల 865 కోట్లు వచ్చాయి.
కేంద్రపన్నుల వాటాలోనూ..
కేంద్ర పన్నుల వాటాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.7వేల 583 కోట్లు రాగా ఇప్పటి వరకూ రూ.8వేల 449 కోట్లు వచ్చాయి. రూ.14 వేల 348కోట్లు అంచనా వేయగా.. 60 శాతం రాబడులు వచ్చాయి. రూ.8వేల 177 కోట్ల గ్రాంట్లు అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ.7వేల 942 కోట్లు వచ్చాయి. పన్నేతర ఆదాయాన్ని రూ.15 వేల 875 కోట్ల అంచనాకు కేవలం రూ.2వేల 983 కోట్లు మాత్రమే వచ్చాయి.
2018 డిసెంబర్ వరకు సొంత పన్నుల రాబడి రూ.50వేల 741 కోట్లు రాగా... ఈసారి రూ.51వేల 812 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం 2018 డిసెంబర్ వరకు పన్నుల రాబడి రూ.58వేల 304 కోట్లు కాగా.. 2019 డిసెంబర్ వరకు రూ.60వేల 261 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల రూ.2వేల కోట్ల లోపే మూడున్నర శాతంగానే ఉంది.
రాబడులు పెరగొచ్చు..
చివరి త్రైమాసికంలో రాబడులు పెరగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని... వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ఇవీ చూడండి: 'పురపోరులో ఓడి ఏకంగా సీఎం అయ్యాడు'