Kishan Reddy Speech In United Nations : ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సమావేశంలో భారతదేశం తరఫున పాల్గొనడం గర్వంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో గత దశాబ్ది కాలంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థిరత్వమే ప్రధాన ఎజెండాగా చేపట్టిన పాలసీలు, ప్రాధాన్యతలతో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతో పాటు ముందుండి విజయవంతంగా నడిపామని తెలిపారు.
గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్నే లక్ష్యం : జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహించామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీంతో పాటుగా గోవాలో జూన్‌లో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఈ గోవా రోడ్ మ్యాప్‌లో.. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్లో భాగంగా పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
స్కిల్స్‌లో భాగంగా యువత నైపుణ్యాలకు పదును పెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపార సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. పర్యాటక రంగంలోని ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్‌లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించామని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
World Environmental Sustainability In Tourism : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనల మేరకు.. ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకెళుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ బేస్డ్.. బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మోదీ ఇటీవలే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రపంచం 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో.. ఇప్పటివరకు ఎలాంటి ప్రగతిని సాధించారో సమావేశంలో వివరించారు.
ఇవీ చదవండి :