EC Suspends Police Officers in Telangana : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓవైపు కౌంటింగ్ జరుగుతుండగానే డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar), అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్ రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్చాలు ఇస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ధ్రువీకరించుకున్న తర్వాత డీజీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్‌లకు తాఖీదులు జారీ చేసింది. ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడవకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఈసీ ప్రతి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కమిషన్ విధుల నుంచి తప్పించింది. సీవీ ఆనంద్‌తో పాటు జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్పీలను పక్కన పెట్టింది. ఐపీఎస్ అధికారులు ఉండగా నాన్ కేడర్ ఐపీఎస్‌లకు ఎందుకు జిల్లాల బాధ్యతలు అప్పజెప్పారని డీజీపీ(DGP)ని ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హైదరాబాద్ సీపీకి ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లు, జిల్లా ఎస్పీల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లను పంపించింది. వాటిలోనుంచి ఎన్నికల కమిషన్ సూచించిన వారికి బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. ఈ విధంగానే జిల్లాలకు ఐపీఎస్‌లను కేటాయించారు.
Telangana Police Officers Were Suspended by EC : ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫిర్యాదులు వచ్చిన పోలీస్ అధికారులపైనా ఈసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 12మంది ఎస్పీలను బదిలీ ఈసీ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పోలింగ్ కంటే రెండు రోజుల ముందు ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడ్‌పల్లి పీఎస్ పరిధిలో డబ్బులు పంచుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పోలీసులు దాడి చేసి రూ.18లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పంచుతున్న వ్యక్తులను పట్టుకొని వాళ్లపై కేసులు నమోదు చేయలేదు. వాళ్లకు బదులు వేరే వాళ్లపై కేసు పెట్టారని ఎన్నికల కమిషన్(Election Commission)కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అంతర్గత దర్యాప్తు నిర్వహించిన ఎన్నికల కమిషన్ అధికారులు విధులను దుర్వినియోగం చేసినందుకు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.
ఇతర జిల్లాల్లోనూ కొంతమంది పోలీస్ అధికారులను ఎన్నికల కమిషన్ ఎంతో కఠినంగా వ్యవహరించి తప్పించింది. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా డీజీపీని సస్పెండ్ చేయడంతో పాటు హైదరాబాద్ సీపీ, పలువురు ఐపీఎస్‌లను బాధ్యతల నుంచి తప్పించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలు ఏ ఎన్నికల్లో చూడలేదంటూ పోలీస్ శాఖలో చర్చించుకుంటున్నారు.