EC Suspended Telangana Tourism MD Manohar Rao : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సీఈసీ పలు సూచనలు చేసింది. తనిఖీలు, ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana Tourism MD Manohar Rao Suspended : తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌రావుపై (Telangana Tourism MD Manohar Rao) సస్పెన్షన్ వేటు పడింది. ఎండీకి ఓఎస్డీగా పనిచేస్తున్న విశ్రాంత అధికారి సత్యనారాయణపై కూడా చర్యలు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అక్టోబర్ 15, 16 తేదీల్లో తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు, ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న సత్యనారాయణ కూడా తిరుమలలో కనిపించారు.
ఇరువురిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.. సీఈసీకి నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా.. ఇద్దరు అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. ఇద్దరు అధికారుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19న మధ్యాహ్నం మూడు గంటల్లోపు నివేదించాలని స్పష్టం చేసింది.
Telangana Tourism OSD Sacked : అంతే కాకుండా పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న మనోహర్‌రావుపై .. ఎంసీసీ నిబంధనల ఉల్లంఘన కింద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్‌కు లేఖ రాసింది. సీఈసీ లేఖ అందుకున్న వికాస్ రాజ్ మనోహర్ రావును సస్పెండ్ చేయడంతోపాటు ఆయన ఓఎస్డీగా పని చేస్తున్న సత్యనారాయణను విధుల నుంచి తప్పించారు.
ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు.. ఎలాంటి ప్రొటోకాల్ నిబంధనలు వర్తించవని ఎన్నికల సంఘం పేర్కొంది. మంత్రులు జిల్లాలకు వచ్చిన సందర్భాల్లో అధికారులు స్వాగతం పలకడం లేదా వెళ్లి కలవడం, వారు వెళ్లేటప్పుడు వీడ్కోలు చెప్పడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిపింది. అధికారులు ఎవరూ అలా వెళ్లి మంత్రులను కలవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
Case Filed on Minister Satyavathi Rathod : మరోవైపు శుక్రవారం రోజున మంత్రి సత్యవతి రాఠోడ్‌పై (Satyavathi Rathod) పోలీసు కేసు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొంగరగిద్దలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలు సత్యవతి రాఠోడ్‌కు మంగళహారతి ఇవ్వగా.. హారతి పళ్లెంలో రూ.4000 వేశారు. ఈ విషయాన్ని గమనించిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సత్యవతి రాఠోడ్ రూ.4,000 మహిళలకు ఇచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గూడూరు పోలీసులు మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఎన్నికల నిర్వహణలో సవాళ్లు - కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని నియోజకవర్గాలపై ఈసీ నజర్