కరోనా నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్షల ప్రారంభ సమయం మారనుంది. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ సమయాన్ని మార్చారు. ఈసారి ఉదయం 9 గంటలకే మొదలుపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఆన్‌లైన్ పరీక్షలకు హాజరైనవారు వినియోగించిన కంప్యూటర్ మౌస్‌లను శానిటైజ్ చేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు ఇచ్చింది. అది జరగాలంటే ఒక పరీక్ష తర్వాత కనీసం 3 గంటల వ్యవధి అవసరం. జేఈఈ మెయిన్‌లోనూ రెండు పరీక్షల మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా మార్పు చేశారు.
ఈ నేపధ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంసెట్ నిర్వహించాలని విద్యామండలి నిర్ణయించింది. ఇక ఐసెట్ రెండున్నర గంటలు, ఎడ్‌సెట్ రెండు గంటల చొప్పున జరుగుతాయి. పరీక్షల మధ్య వ్యవధి మాత్రం రెండు గంటలే ఉండగా... దాన్ని పెంచేందుకు పరీక్షల సమయాలను మార్చుతున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి నిర్ణయం తీసుకున్నట్లు విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అయితే ఒక విడత జరిగే పరీక్షలకు ఈ ఇబ్బంది ఉండదు.