కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సమయంలో ఎక్కువ మంది గుమికూడకపోవడమే మంచిదని పేర్కొన్నారు. మార్చి 31 వరకు అన్ని ఫంక్షన్ హాళ్లు మూసేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
పదో తరగతి విషయంలో జాగ్రత్తలు
పదో తరగతి పరీక్షల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించామన్నారు. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు నిర్వహించాలని కోరారని సీఎం తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
వాటి ధర పెరగకూడదు...
నిత్యావసరాల ధరలు పెరగకూడదనే ఉద్దేశంతో దుకాణాలను మూసివేయడం లేదని సీఎం వివరించారు. దుకాణాల్లోకి ఒకేసారి ఎక్కువమంది రాకుండా దుకాణాదారులే చూసుకోవాలని సూచించారు.
స్వీయ నియంత్రణే అత్యుత్తమ మార్గమన్నారు. ఐసోలేషన్‌లో ఉన్నవారిలో అందరి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. కరోనా బాధితుల్లో ఎవరికి ప్రాణాపాయం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.