Massive Drunk and Drive Cases on New Year Eve : న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో మంగళవారం భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,184 కేసులు నమోదు కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఐటీ కారిడార్‌లోని తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు ఎస్ఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తుగా తగిన చర్యలు చేపట్టారు. మందుబాబులు, ఆకతాయిలపై దృష్టి సారించారు.
మరోవైపు మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 15, 2024 వరకు పోలీసులు విధించిన జరిమానాల మొత్తం రూ.535 కోట్లు దాటింది. దీనికి సంబంధించి 1,57,65,552 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే కేసులు (1,57,68,339) జరిమానాలు (రూ.540.91 కోట్లు) ఈసారి స్వల్పంగా తగ్గాయి. అధిక వేగంతో ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ తదితర ఉల్లంఘనలు రహదారులతోపాటు కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కెమెరాల్లో కూడా ఈ ఉల్లంఘనలు చిక్కుతుండటంతో జరిమానాలు విధిస్తున్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణాలే ఎక్కువ : హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న సమయాల్లో రోడ్డు ప్రమాదాలకు గురైతే మరణాలు సంభవించే ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నా చాలామందిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ తరహా ఉల్లంఘనలే 2024లో ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల జరిమానాల్లో సుమారు మూడొంతులు హైదరాబాద్ కమిషనరేట్‌లోనే ఉన్నాయి.
రాచకొండ, సైబరాబాద్‌తో కలిపి నగరంలో మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘనలపై నమోదైన కేసులను పరిశీలిస్తే రాష్ట్రంలోని మొత్తం రెండింట మూడొంతులు ఈ మూడు కమిషనరేట్ల పరిధిలోనే ఉన్నాయి. ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో కోటికిపైగా వాహనాలుండటం, పైగా అక్కడి రోడ్లుపై సీసీటీవీ కెమెరాలు ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.
న్యూ ఇయర్ వేళ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు : పోలీసుల వార్నింగ్
హైదరాబాద్‌లో 260 చెక్ పాయింట్స్ పెట్టారంట - మందుబాబులారా జర జాగ్రత్త