కరోనా సృష్టించిన సంక్షోభం... ప్రజల అలవాట్లనూ ఎంతో కొంత మార్చేసింది. లాక్‌డౌన్ సమయంలో ఇల్లు కదలలేని స్థితి కొత్త మార్గాలను చూపింది. నిత్యావసరాలు మొదలు... సమస్త వస్తువులు గడప దాటకుండానే కొనుగోలు చేసే సంస్కృతికి ఊపిరులూదింది. జనం అవసరాలను ఈ-కామర్స్ సంస్థలు అందిపుచ్చుకున్నాయి. మారుమూల పల్లె ప్రాంతాలకు కూడా సరఫరా సదుపాయం కల్పించడంతో ఈ వ్యాపారం విస్తరిస్తోంది.
ఇటీవల వరకు తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్ లాంటి నగరాల్లో ఈ-కామర్స్ సేవలు అందేవి. అనంతర కాలంలో పక్కనే ఉన్న చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలకు విస్తరించాయి. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్ లాంటి చిన్న పట్టణాల పరిధిలోని కల్పగూరు, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, మారేపల్లి, ఆత్మకూరు లాంటి పలు పల్లెల ముంగిటకు చేరాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడలాంటి పెద్ద నగరాల్లో ఈ-కామర్స్ సేవలు అందుబాటులో ఉండేవి. తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు వంటి జిల్లా కేంద్రాలకు.. ఆనక పలాస, సోంపేట, టెక్కలిలాంటి చిన్న పట్టణాలకు విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రానికి శివారులో ఉండే సిక్కోలు జిల్లా మందస, ఇచ్ఛాపురం మండలాల పరిధిలో హరిపురం, వీరగున్నమ్మపురం, కొత్తపల్లి, శాసనం, మామిడిపల్లి లాంటి పల్లె ప్రజలు సైతం ఈ-కామర్స్ సేవలు పొందుతున్నారు.
4జీ మహిమ.. కలిసొచ్చిన కరోనా
విశాఖలో ఉండే శ్రీనివాస్‌కు సొంతూరులో ఉండే తల్లిదండ్రులకు కొన్ని వస్తువులు పంపాల్సి వచ్చింది. వెంటనే ఫోన్ తీసి ఈ-కామర్స్ సైట్‌లో ఆర్డర్ ఇచ్చారు. మూడు రోజుల్లో ఊళ్లోని ఇంటివద్దకే వచ్చి అందించి వెళ్లారు. ఇప్పుడు పట్టణాల్లో ఉండేవారు కూడా గ్రామాల్లో ఉండే తమవారి పుట్టినరోజు, పెళ్లిరోజు ఇతర శుభకార్యాలకు కానుకలు ఇలాగే పంపుతున్నారు. గ్రామీణులు సైతం తమకు నచ్చిన బ్రాండెడ్ వస్తువులను పట్టణాలకు వెళ్లి కొనడం తగ్గించి.. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నారు. 4జీ నెట్ సేవలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించడం, నోట్ల రద్దు, కరోనా వంటి అంశాలు పట్టణాలతో పాటు.. పల్లెల్లోనూ ఆన్‌లైన్ షాపింగ్‌కు ఊతమిచ్చాయి.
రకరకాల మోడళ్లు.. రాయితీలు
బిగ్ బిలియన్ సేల్, డీల్స్ ఆఫ్ డే పేరుతో ఈ-కామర్స్ సైట్లు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్పత్తులపై భారీ రాయితీలు ఇస్తున్నాయి. వంటింట్లో వాడే గరిటె నుంచి అన్ని గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, పిల్లలు, పెద్దల దుస్తులు ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నాయి. గ్రామాల్లో ఉండే వారికి నచ్చిన మొబైల్ లేదంటే ఇతర వస్తువులు కావాలంటే సమీప పట్టణాల్లో షోరూంలకు వెళ్లాలి. టీవీలు, ఫ్రిజ్‌లు కొంటే రవాణా ఖర్చులు సొంతంగా భరించాలి. అదే ఈ-కామర్స్ సంస్థలు రకరకాల మోడళ్ల వస్తువులను అదనపు రుసుం లేకుండా ఇంటికి చేరుస్తున్నాయి. పైగా వస్తువు నచ్చకపోతే వాపసు చేసే వెసులుబాటు ఉంది.
ఈ-గ్రాసరీకి పెరుగుతున్న ప్రాధాన్యం
గతంలో నిత్యావసరాల కోసం పల్లెల నుంచి సమీప పట్టణాలకు వెళ్లి కొని తెచ్చుకునేవారు. ఇప్పుడు పలు గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర దుకాణాలు ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో వీటికోసం ఈ-కామర్స్ వెబ్‌సైట్లను ఆశ్రయించేవారు పెరిగారు. కొవిడ్-19 తర్వాత ఈ గ్రాసరీ వ్యాపారం పెరిగింది. దేశంలో 55,000 కోట్ల డాలర్ల నిత్యావసర మార్కెట్ ఉండగా.. ఇందులో ఆన్‌లైన్ భాగం తక్కువే. కరోనా తర్వాత ఈ వ్యాపారం పుంజుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆన్‌లైన్‌లో ఔషధాలు
కొవిడ్ తర్వాత ఔషధాలను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారు. పట్టణాల్లో ఆర్డర్ ఇచ్చిన 24 గంటల్లో.. మారుమూల ప్రాంతాలకు రెండు, మూడు రోజుల్లో వీటిని చేర్చుతున్నారు. చిన్న చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో కొన్ని దొరకడం లేదు. కొన్ని ఫార్మాసంస్థలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా వీటిని విక్రయిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరలపై 10-15 శాతం తగ్గిస్తుండటంతో చాలామంది ఆన్‌లైన్ ఔషధాలపై ఆసక్తి చూపుతున్నారు.
వేగంగా అందించేందుకు ప్రణాళికలు
ఒకప్పుడు ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఏదైనా వస్తువులకు ఆర్డర్ ఇస్తే చాలా సమయం పట్టేది. బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల నుంచి ఇక్కడకు పంపేవారు. ఇందుకు 10-15 రోజులు సమయం పట్టేది. ఈ వ్యవధి తగ్గించేందుకు ఆయా సంస్థలు సమీప నగరాల్లో సరఫరా కేంద్రాలు(డెలివరీ స్టేషన్లు) ఏర్పాటు చేస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తన అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చిన్న పట్టణాలు, పల్లెల్లోకి సకాలంలో ఉత్పత్తులు అందించడానికి వెసులుబాటు ఏర్పడింది. నగరాలకు 24-48 గంటలు.. పల్లెలకు 3-7 రోజుల్లో వస్తువులను చేర్చుతోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవధి తగ్గించడానికి ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2010 నాటికి ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ ఒక బిలియన్ డాలర్లు ఉంటే.. అది 2019 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 నాటికి అది 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
మారిన యువత బతుకు చిత్రం
![](https://assets.eenadu.net/article_img/ghmain-2i_2.jpg)
ఈ-కామర్స్ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తోంది. సొంత ద్విచక్రవాహనం ఉంటే చాలు.. వారిని డెలివరీ బాయ్‌లుగా తీసుకుంటున్నాయి. సమీప పట్టణాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులుంటే.. వాటిద్వారా డెలివరీ బాయ్‌లు వచ్చి ఉత్పత్తులను అందిస్తున్నారు.
- షాపింగ్ సరే.. జాగ్రత్తలు పాటించాలి సుమా
ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు సైట్‌లలో థర్డ్ పార్టీ ఇచ్చే ప్రకటనలు చూసి వస్తువులను కొంటే డబ్బులు పోగొట్టుకున్నట్లే. కొందరు సైబర్ నేరస్తులు ప్రధాన ఈ-కామర్స్ సంస్థల లోగోలతో ఖరీదైన ఫోన్లు రూ.5-10 వేలేనని పెడుతుంటారు. కొందరు వీటిద్వారా చెల్లింపులు చేసి చేతులు కాల్చుకుంటున్నారు.
![](https://assets.eenadu.net/article_img/ghmain-2j_2.jpg)
- లాక్‌డౌన్ సమయంలో ఇంటికే మద్యం సరఫరా చేస్తామని సైబర్ మోసగాళ్లు సామాజిక సైట్లలో పెట్టిన ప్రకటనలు చూసి ఆ లింకుల ద్వారా డబ్బులు చెల్లించి చాలామంది నష్టపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
- వాట్సప్‌లు, ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయకూడదు. సైబర్ మోసగాళ్లు వస్తువులు తక్కువకే విక్రయిస్తామంటూ ఎర వేస్తుంటారు.
- వస్తువు అసలు ధర మీద 50-70 శాతం, ఆపై రాయితీ ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఉంటే అలాంటి ఉత్పత్తులపై పునరాలోచించాలి. ఇందులో చాలావరకు మోసపూరిత ప్రకటనలేనని గ్రహించాలి.
- కొన్ని ఈ-కామర్స్ సైట్లలో ఉత్పత్తులు నాసిరకంగా ఉండే అవకాశమూ ఉంది. థర్డ్ పార్టీ సంస్థలు వీటిని పంపుతుంటాయి. రూ.70-80 వేలతో ఫోన్లు కొన్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
- సదరు సంస్థకు కస్టమర్ కేర్ నంబరు ఉందా లేదా? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు లాంటి వివరాలు తెలుసుకోవాలి. కస్టమర్ కేర్ విభాగాలను మెరుగ్గా నిర్వహించే సంస్థలను ఎంపిక చేసుకోవాలి.
- ఇంటర్నెట్ సెంటర్లు, పబ్లిక్ వైఫైలు, ఇతరుల కంప్యూటర్లలో ఆన్‌లైన్ షాపింగ్ చేయకూడదు. నమ్మకమైన సైట్ అయితేనే సొమ్ము చెల్లించాలి.