drugs awareness: మాదక ద్రవ్యాల సరఫరాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మనందరం కలిసి కృషి చేయాలని కోరారు. నగర పోలీసుల అధ్వర్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులతో ప్రతిజ్ఞ
డ్రగ్స్ నివారణకు నగర పోలీసులు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్, డీసీపీ చందనా దీప్తి, నటులు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, సినీ దర్శకుడు కొరటాల శివ, గాయకులు రాహుల్ సిప్లీగంజ్, రామచందర్ పాల్గొని మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి విద్యార్థులకు వివరించారు. సినీ గాయకులు రాంచందర్, రాహుల్ సిప్లీగంజ్ తమ పాటలతో అలరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు.
డ్రగ్స్ వినియోగం ద్వారా మనంతట మనమే నష్టం చేసుకుంటున్నాం. దీనిని పారద్రోలాలంటే మనందరం కలిసి కృషి చేయాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్నీ నిర్వహించాలి. ఎవరైనా డ్రగ్స్ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డ్రగ్స్ సరఫరా చేసినా, డ్రగ్స్ వినియోగించినా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని హెచ్చరించారు. - తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ వినియోగాన్ని సిరీయస్గా తీసుకున్నాం. మేం రెండు రకాలుగా చర్యలు చేపడుతున్నాం. డ్రగ్స్ రవాణా చేసేవాళ్లను గుర్తించేందుకు కొత్తవింగ్ను ఏర్పాటు చేశాం. డ్గగ్స్ పెడ్లర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా పెంచాం. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పేరుతో ఏర్పాటు చేశాం. - సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఇదీ చూడండి: