జంట నగరాల్లోని డ్రైనేజ్ వ్యవస్థతోనే అసలు సమస్య. గంట వ్యవధిలో 2 సెంటిమీటర్ల వర్షం పడితే ఆ నీరు రోడ్లపై నిల్వకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అంతకు మించే వర్షం కురవడం వల్ల రోడ్లపైకి భారీగా నీరు ప్రవహిస్తోంది. మురుగు నీటి కాలువలు కాక కేవలం వర్షం నీరు వెళ్లేందుకు జీహెచ్ఎంసీ కాలువలు ఏర్పాటు చేసింది. ఐతే.. వీటి సంఖ్య తక్కువగా ఉంది. జంటనగరాల్లో మొత్తం 9వేల కిలోమీటర్ల మేర రహదారులుంటే అందులో 1200కిలో మీటర్ల వరకు మాత్రమే వర్షం నీరు వెళ్లడానికి కాలువలు నిర్మించారు. నిబంధనల ప్రకారం ఎన్ని కిలోమీటర్ల రోడ్లుంటే...మురుగు కాలువలతో సమానంగా అన్ని కిలో మీటర్ల వరకు వర్షం నీరు వెళ్లే కాలువలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన పాటించకపోవటం వల్ల వర్షం కురిసిన ప్రతిసారి ఇవే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నాలాలున్న ప్రాంతాల్లో నరకయాతన
జంటనగరాల్లో జనావాసాల మధ్య పలు కాలనీలు, బస్తీల్లో నాలాలున్నాయి. వీటిలో ఓపెన్ నాలాలే అధికంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే నాలాలున్న ప్రాంతాల్లోని జనాల జీవనం నరకయాతనగా మారుతోంది. ఈ నోరు తెరిచిన నాలాలతో గ్రేటర్ వ్యాప్తంగా స్థానికుల ఉసురు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఏటా జరుగుతుండడం వల్ల నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతేడాది పాతబస్తీ, ఎల్‌బీ నగర్‌లో నాలాల్లో ఒకరిద్దరు కొట్టుకుపోయిన సంఘటనలు ఆందోళన కలిగించాయి. రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడం వల్ల వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నాలాలకు పై కప్పులు, ప్రహరీల నిర్మాణం చేపట్టేందుకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది బల్దియా. కానీ... క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోయారు
ఉప్పుగూడ అరుంధతి కాలనీ పరిధిలో కొన్నేళ్ల క్రితం ఓ బాలుడు క్రికెట్ ఆడుతూ నాలాలో పడి మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం అరుంధతి నగర్ వద్ద నల్లవాగు నాలాలో బంతి కోసం దిగిన బాలుడు మృత్యువాత పడ్డాడు. పూల్‌బాగ్ వద్ద ఇదే నల్లవాగు నాలాను ఆనుకుని ఉన్న ఇల్లు కూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. 2010లో తలాబ్‌కట్ట నాలాలో బాలుడు మరణించగా, చిలకల గూడ నాలాలో పడి ఇద్దరు మృతి చెందారు. కవాడిగూడ ప్రాగాటూల్స్ వద్ద ఉన్న నాలాలో పడిపోయి ఓ వ్యక్తి మరణించాడు.
దడ పుట్టిస్తున్నాయి..
నగరంలో పలు చోట్ల ప్రమాదకర నాలాలు ఉన్నాయి. మన్సురాబాద్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్‌కేపురం, హయత్‌నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. మోతీనగర్ డివిజన్ బబ్బుగూడ, రామారావునగర్, స్నేహపురి కాలనీ, లక్ష్మీనగర్, గాయత్రినగర్‌లో ఉన్న ఓపెన్ నాలాల్లో తరచూ చిన్న పిల్లలు పడి గాయపడుతున్నారు. పశువులూ పడిపోతున్నాయి. ఉస్మాన్‌గంజ్ ఓపెన్‌నాలా గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ మీదుగా వెళ్లి ఇమ్లిబన్ వద్ద మూసీలో కలుస్తుంది. దీనికి ఇరువైపులా వేలాది కుటుంబాలు ఉన్నాయి. కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నాలాకు చాలాచోట్ల రక్షణ గోడ లేదు. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్‌సెల్ ఆఫీస్ ప్రాంతాలలో నాలాలు దడ పుట్టిస్తున్నాయి. పటేల్‌కుంట చెరువు వద్ద ప్రారంభమై హెచ్‌ఎంటీనగర్ చెరువులో కలిసే నాచారం పెద్ద నాలాలో తరచూ ప్రమాదాలే.
వర్షం వస్తే చాలు..
వర్షం వచ్చిందంటే పలు ప్రాంతాల్లో భారీగా వరద నిలిచిపోతుంది. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల లెక్కల ప్రకారం నగరంలో 132 నీరు నిలిచే ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో 24 అధికంగా నీరు నిలిచే పాయింట్లు ఉన్నాయి. మైత్రీవనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్‌డీకా పూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నీరు వెళ్లేందుకు క్యాచ్‌పిట్, మ్యాన్‌హోల్ మూతలు తీస్తుంటారు. ఇదీ ప్రమాదాలకు దారి తీస్తోంది.
భాగ్యనగర వాసులకు దడ పుట్టిస్తున్న నాలాలు
వర్షాకాలం వస్తోందంటే గ్రేటర్‌లో నాలాలపై చర్చ మొదలవుతుంది. ఆక్రమణలు తొలగిస్తాం అని, విస్తరణ పనులు చేపడతామని జీహెచ్‌ఎంసీ, పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు చెప్పడం పరిపాటిగా మారింది. ఏళ్లు గడుస్తున్నా నాలాల పరిస్థితి మాత్రం మారడం లేదు. విస్తరణ సంగతేమో గానీ..కాలక్రమేణా నాలాలు మరింత కుచించుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మించినా సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదు. వరద ముంపు నియంత్రించేందుకు నాలాల విస్తరణ చేపట్టాలని ఎప్పుడో నిర్ణయించారు. అనుకున్నంత మేర పనులు మాత్రం జరగలేదు. అందుకే ఈ అవస్థలు.
ఇవీ చూడండి: భయం భయం: భాగ్యనగరంలో డెత్ స్పాట్లుగా మ్యాన్ హోళ్లు