ETV Bharat / state

స్ఫూర్తిదాయకం: వైద్యుడు లేని చోట.. ఈ రూపాయి డాక్టర్​ సేవ..! - పద్మశ్రీ గ్రహీతలు డాక్టర్​ రవీంద్ర దంపుతుల ప్రత్యేక కథనం

వైద్యులు రోగాలను నయం చేస్తారు కానీ డాక్టర్‌ రవీంద్ర మాత్రం రోగాలతోపాటు వాటికి మూలకారణాలనూ శోధించి నయం చేయాలనుకున్నాడు. అందుకు ‘వైద్యుడు లేని చోటు’ను వెతుక్కుంటూ వెళ్లాడు. మూడున్నర దశాబ్దాల నిర్విరామ కృషితో న్యుమోనియా నుంచి పిల్లల్నీ, పేదరికం నుంచి పెద్దల్నీ విముక్తుల్ని చేసి మొత్తంగా వందలాది గిరిజన పల్లెల స్వరూపాన్నే మార్చేశాడు. ఆ పనిలో ఆయనకు కుడిభుజమై నిలిచింది భార్య డాక్టర్‌ స్మిత. ఈ దంపతుల నిస్వార్థ సేవాయానం అందరికీ స్ఫూర్తిదాయకం..!

Dr. Ravindra couple medical aid to the poor in madhya pradesh biraghad
స్ఫూర్తిదాయకం: వైద్యుడు లేని చోట.. ఈ రూపాయి డాక్టర్​ సేవ..!
author img

By

Published : Nov 1, 2020, 11:17 AM IST

ముప్పై ఐదేళ్ల క్రితం సంగతి... డాక్టర్‌ పట్టా పుచ్చుకుని వచ్చిన కొడుకుని చూసి పొంగిపోయారు ఆ తల్లిదండ్రులు. రెండువైపుల కుటుంబాల్లోనూ మొట్టమొదటి డాక్టరు తమ బిడ్డే మరి. ఇప్పుడు డాక్టరుగా సొంతూళ్లో అతడు వైద్యం చేస్తుంటే అమ్మానాన్నలుగా తమకి ఎంత గౌరవం... ఎంత ప్రతిష్ఠ..! కొడుకుని చూసుకుని గర్వంతో ఉప్పొంగిపోయాయి వారి హృదయాలు. తండ్రి దేవరావ్‌ కొల్హె రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటూ కారుల్లో తిరిగే డాక్టర్లను చూసి రేపో మాపో తన కొడుకూ అలా దర్జాగా ఉంటాడని కలలు కన్నాడు.
కానీ, కొడుకు చెప్పింది విని ఒక్కసారిగా చిన్నబోయాయి ఆ పెద్దల మనసులు. తాను గాంధీజీ, వినోబా భావే లాంటి వాళ్లు చూపిన మార్గంలో నడవాలను కుంటున్నాననీ, డాక్టరు సౌకర్యం లేని పల్లెటూళ్లలో సేవ చేయాలనుకుంటున్నాననీ తల్లిదండ్రులకు చెప్పాడు రవీంద్ర. తమ ఆశలన్నీ కుప్పకూలినా- కన్న కొడుకు యోగ్యుడై గొప్పవాళ్లు నడిచిన బాటలో నడుస్తానంటే కాదనలేకపోయారు ఆ అమ్మానాన్నలు. కొడుకు తమకు దూరమవుతున్నాడన్న బాధని దిగమింగి ‘నీ ఇష్టమే మా యిష్టం’ అన్నారు. దాంతో రవీంద్ర తనకు కావాల్సిన కొద్దిపాటి సరంజామాను సర్దుకుని ఎంచుకున్న గమ్యస్థానానికి ప్రయాణమయ్యాడు.

పుస్తకమే ప్రేరణ
చిన్ననాటినుంచీ రవీంద్రకు చదువంటే ఇష్టం. ఏ పుస్తకం కన్పించినా వదిలేవాడు కాదు. నాగపూర్‌లో కాలేజీ లైబ్రరీకి తోడు దగ్గరలోనే రామకృష్ణ మఠం వారి గ్రంధాలయం కూడా ఉండటంతో ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదివాడు. వాటినుంచీ స్ఫూర్తిపొందిన రవీంద్ర వైద్యుడిగా తాను అవసరంలో ఉన్న వారికి సాయపడాలనీ, డబ్బు సంపాదన కోసం పనిచేయకూడదనీ అనుకునేవాడు. అదే సమయంలో కాకతాళీయంగా అతడి దృష్టి ‘వైద్యుడు లేని చోట’ అనే పుస్తకం మీద పడింది. నలుగురు వ్యక్తులు ఒక రోగిని మోసుకుంటూ వెళ్తున్న ఫొటో, పక్కన ‘ఆస్పత్రి 30మైళ్ల దూరంలో’ అని రాసి ఉన్న మైలురాయి... ఆ పుస్తక ముఖచిత్రం. అది రవీంద్రని ఆలోచనల్లో పడేసింది. మన దేశంలోనూ అలాంటి ఊళ్లు చాలానే ఉన్నాయని అతడికి తెలుసు. వ్యాధి పూర్తిగా ముదిరినాక మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వచ్చే కేసులెన్నో చూశాడు అతడు. ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారని అడిగితే వాళ్లు చెప్పే సమాధానం- తాము చాలా దూరంలో ఉంటామనీ అక్కడ ఆస్పత్రులేవీ లేవనీ. అందుకే, అలా వైద్య సహాయం ఏమాత్రం అందుబాటులో లేని మారుమూల ప్రాంతంలోనే తాను పనిచేయాలనుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా వేర్వేరు ప్రాంతాలు చూసివచ్చేవాడు. చివరకు మహారాష్ట్ర- మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని మేల్ఘాట్‌ అనే కొండ ప్రాంతంలో ఉన్న బైరాగఢ్‌ని తన కార్యస్థలంగా ఎంచుకున్నాడు. అక్కడికి వెళ్లాలంటే జిల్లా కేంద్రమైన అమరావతిలో బయల్దేరి 120కి.మీ. దూరంలో ఉన్న హరిసాల్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో 40కి.మీ. నడిస్తే బైరాగఢ్‌ వస్తుంది. రోడ్లు లేని ఆ గిరిజన ప్రాంతాలను చేరుకోడానికి నడక తప్ప మరో మార్గమే లేదు. గమ్యస్థానాన్ని ఎంచుకున్నాక తన నిర్ణయాన్ని ప్రొఫెసర్లకు చెప్పాడు. ‘అంతా బాగానే ఉంది కానీ నీకేం తెలుసని అక్కడ వైద్యం చేస్తావు? స్కానింగ్‌ లేకుండా కాన్పు చేయగలవా, ఎక్స్‌ రే చూడకుండా న్యుమోనియాని కనిపెట్టగలవా, డయేరియాకి చికిత్స చేయగలవా?’ ప్రశ్నించారు ఒక ప్రొఫెసర్‌. సేవ చేయాలన్న ఉత్సాహమే తప్ప అనుభవం లేని రవీంద్ర ఆ ప్రశ్నలకు తెల్లమొహం వేశాడు. అప్పటివరకూ పల్లెటూళ్లలో పనిచేయడానికి తన ఎంబీబీఎస్‌ చదువు చాలనుకున్నాడు. ‘గ్రామాల్లో వైద్య సహాయం అవసరమైన ప్రధాన వ్యాధులవి. వాటి గురించి బాగా నేర్చుకుని వెళ్లు ఎందుకంటే, అక్కడ పరీక్షలు చేసి చెప్పేందుకు ల్యాబ్‌లు ఉండవు’ అని ప్రొఫెసర్‌ చెప్పడంతో ముంబయి వెళ్లి ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరాడు. ‘మగవాడివి... నీకు కాన్పుల గొడవ ఎందుకూ...’ అని అక్కడి వైద్యులు నిరుత్సాహ పరిచేవారు. అవేవీ విన్పించుకోకుండా తన నిర్ణయం గురించి చెప్పి కనీస వసతులతో కాన్పుచేసి తల్లీబిడ్డల ప్రాణాల్ని కాపాడడం ఎలాగో నేర్చుకున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకున్నాడు. మిగిలిన విషయాల్లోనూ తన సామర్థ్యం మీద నమ్మకం వచ్చాక బైరాగఢ్‌ బయల్దేరాడు. ఆర్నెల్లు అక్కడ పనిచేసి ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చనుకున్నాడు.

రూపాయి డాక్టర్‌
ఖాదీ దుస్తులు ధరించి తన బ్యాగు తానే మోసుకుంటూ వచ్చి డాక్టరునని పరిచయం చేసుకున్న రవీంద్ర అక్కడి వారికి వెంటనే నచ్చేశాడు. తమలో ఒకడిగా చూసుకుంటూ, ఉండటానికి ఒక గుడిసె వేసిచ్చారు. వైద్యం కోసం వచ్చిన వారి దగ్గర ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేవాడు రవీంద్ర. అదైనా మందులు కొనాలి కాబట్టి. న్యుమోనియా, మలేరియా లాంటి జ్వరాలు వస్తే చనిపోవటమే తప్ప చికిత్సతో బతుకుతారని అప్పటివరకూ అక్కడివారికి తెలియదు. ఆ జ్వరాలను రవీంద్ర నయం చేయడంతో వారికి ఆయనమీద నమ్మకం పెరిగింది. ఒకసారి ఒక వ్యక్తికి పేలుడు వల్ల చెయ్యి తెగిపోయింది. అది జరిగిన పదమూడు రోజులకు అతడు రవీంద్రను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పటికే గాయం సెప్టిక్‌ అయి, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. సర్జన్‌ కాకపోవడంతో రవీంద్ర అతడికి చికిత్స చేయలేకపోయాడు. గర్భంతో ఉన్న స్త్రీలకు టీటీ ఇంజెక్షన్‌ చేయించుకోవాలని తెలిసేది కాదు. దాంతో కాన్పు తర్వాత ధనుర్వాతం వచ్చి చనిపోయేవారు. ఆరోజుల్లో ఆ ఇంజెక్షన్‌ ఖరీదు కేవలం పావలా. అయినా వారికి తెలియక, చెప్పేవాళ్లు లేక నిండు ప్రాణం పోయేది. పేదరికం వల్ల సరైన ఇల్లూ ఒంటినిండా బట్టా కూడా ఉండేవి కావు చాలామందికి. దాంతో పసిబిడ్డలను న్యుమోనియా కబళించేది. పోషకాహారలేమి, మలేరియా, పాముకాటు... ఎక్కువగా మరణాలకు కారణమయ్యేవి. అయితే ఎవరితో మాట్లాడినా మరణాలకు కారణాలను చెప్పేవారే కానీ వాటన్నిటికీ మూలకారణమైన పేదరికాన్ని ఎవరూ ప్రస్తావించేవారు కాదు. ఈ పరిస్థితి రవీంద్రను కలవరపరిచింది. వైద్యం మాత్రమే కాక తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అర్థమైన రవీంద్ర ముందు పీజీ చేసి నైపుణ్యాలను పెంచుకోవాలనుకున్నాడు. ఆర్నెల్లు అనుకుని వచ్చినవాడు ఏడాదిన్నర తర్వాత బైరాగఢ్‌ వదిలి మళ్లీ మెడికల్‌ కాలేజీకి వెళ్లాడు. ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌లో పీజీలో చేరి, పల్లెల్లో తాను గమనించిన పరిస్థితుల ఆధారంగా పోషకాహార లోపం ఎంత తీవ్రమైన సమస్యో చెబుతూ, అది పోవాలంటే పేదరికనిర్మూలన చర్యలు చేపట్టాలని సూచిస్తూ థీసిస్‌ రాశాడు. సాధారణంగా ఎవరూ అలాంటి సూచనలు చేయరు. దాంతో అది వార్తల్లోకి రావడం, బీబీసీ వాళ్లు వచ్చి ప్రత్యేకంగా సర్వే చేసి ప్రసారం చేయడంతో దాని మీద పెద్ద చర్చే జరిగింది. ఈ లోపు పీజీ పట్టాతో మరిన్ని నైపుణ్యాలతో తిరిగి బైరాగఢ్‌ ప్రయాణమయ్యాడు రవీంద్ర. అయితే ఈసారి ఒంటరిగా కాదు, పెళ్లి చేసుకుని జంటగా వెళ్లాలనుకున్నాడు.

నాలుగు షరతులు
పెళ్లికొడుకు డాక్టరు అనగానే చాలా సంబంధాలే వచ్చాయి. రవీంద్ర పెట్టిన నాలుగు షరతులూ విని అన్నీ వెనక్కి పోయేవి. ఆ షరతులేమిటీ అంటే- బైరాగఢ్‌ చేరడానికి 40కి.మీ. నడవగలగాలి. రిజిస్టర్‌ మ్యారేజ్‌కి ఒప్పుకోవాలి. నెలకు నాలుగు వందల రూపాయలతో ఇల్లు గడపాలి. చివరగా- సాటి మనిషిని కాపాడే క్రమంలో ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ షరతులన్నీ విని అమ్మాయిల తల్లిదండ్రులు మౌనంగా వెళ్లిపోయేవారట. ఇక లాభం లేదనుకుంటుండగా డాక్టర్‌ స్మిత నుంచి అంగీకారం వచ్చింది. ఆమె అప్పటికే హోమియో డాక్టరుగా ప్రాక్టీసు చేస్తోంది. రవీంద్ర ఆశయాలు నచ్చిన ఆమె ఆ ప్రాక్టీసు వదిలి రవీంద్రను పెళ్లి చేసుకుని బైరాగఢ్‌ ప్రయాణమైంది.

అక్కడికి చేరగానే తానూ పల్లెటూరి మహిళలా నిరాడంబరంగా ఉంటూ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది స్మిత. అయినా ఎందుకో ఆమె పట్ల వారి ప్రవర్తన ఒకింత సంకోచంగానే ఉండేది. అలా రోజులు గడుస్తుండగా స్మితకు మొదటికాన్పు సీరియస్‌ అయింది. అందరికీ చేసినట్లే భార్యకు కూడా రవీంద్రే కాన్పు చేశాడు. కానీ తర్వాత తల్లీబిడ్డలకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. దాంతో వారిద్దర్నీ వెంటనే పట్టణానికి తీసుకెళ్లమన్నారు గ్రామస్థులు. రవీంద్రకి కాళ్లూ చేతులూ ఆడలేదు. మనసులో సంకోచం... ఇప్పుడు తమ అవసరానికి పట్టణానికి వెళ్లిపోతే తిరిగి గ్రామస్థులకు ముఖం చూపించగలడా, ఇన్నాళ్లూ తమ పట్ల వారు పెంచుకున్న నమ్మకం ఏమవుతుంది... ఎటూ తేల్చుకోలేక నిర్ణయాన్ని స్మితకే వదిలేశాడు. ఆమె కూడా పట్టణానికి వెళ్లడానికి అంగీకరించలేదు. మొత్తానికి వారం రోజులకు అంతా సర్దుకుంది. ఈ సంఘటనతో ఊరివాళ్లలో అప్పటివరకూ స్మిత పట్ల ఉన్న సంకోచమూ పోయింది. మనస్ఫూర్తిగా ఆ కుటుంబాన్ని తమలో కలుపుకున్నారు.

అన్నీ వారే..!
భార్యాభర్తలిద్దరూ కలిసి ఓవైపు వైద్యం చేస్తూనే మరో పక్క అక్కడి వారిలో చైతన్యం తేవడానికి ప్రయత్నించేవారు. పరిసరాల శుభ్రత, పోషకాహారం పట్ల అవగాహన పెంచేవారు. నీటిని సంరక్షించుకోవడం, పెరట్లో కూరగాయలూ, ఆకుకూరలూ పండించుకోవడం ఎలాగో నేర్పించేవారు. మేల్ఘాట్‌ చాలా వెనకబడిన ప్రాంతం. బైరాగఢ్‌ చుట్టుపక్కల మొత్తం 317 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటినీ కాలినడకన తిరిగేవారు రవీంద్ర, స్మిత. అందరినీ పరిచయం చేసుకుని పలకరిస్తూ యోగక్షేమాలు కనుక్కుంటూ వెళ్లేవారు. దాంతో ఆ పల్లెల్లోని ప్రజలకు వారి పట్ల అభిమానం పెరిగింది. మనసు విప్పి తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. వారి సలహాలను పాటించేవారు. ఆఖరికి పశువులకు ఆరోగ్యం బాగోకపోయినా, పంట చెడిపోయినా వచ్చి డాక్టరుగారితోనే చెప్పుకునేవారు. రవీంద్ర ఏనాడూ వారిని విసుక్కునేవాడు కాదు. వారి బాధలన్నీ ఓపిగ్గా విని, ఆ కష్టాలు తీర్చడానికి తానేం చేయగలనా అనే ఆలోచించేవాడు. పశువైద్యుడిగా పనిచేస్తున్న స్నేహితుడి దగ్గరికి వెళ్లి ఆ ప్రాంతంలో పశువులకు వచ్చే వ్యాధులూ చికిత్సల గురించి తెలుసుకుని వచ్చి ఆ వైద్యమూ చేసేవాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లి సాగులో నైపుణ్యాలు నేర్చుకుని వచ్చాడు. పురుగు మందుల అవసరం లేని, చీడ పట్టని కొత్త వంగడాన్ని రూపొందించాడు. దాన్ని వాడమని రైతులకు చెబితే కొత్తది కాబట్టి పండుతుందో పండదో అని సందేహిస్తారు. ఒకవేళ పండకపోతే వాళ్లు నష్టపోతారని, తానే పండించి చూడటానికి సొంతంగా వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. డాక్టర్లైన భార్యాభర్తలు పొలంలో పనిచేయడం చూసి రైతులూ ఉత్సాహంగా పంటల్లో ప్రయోగాలు చేయడానికి ముందుకొచ్చేవారు. అలా అన్ని విషయాల్లోనూ పల్లె ప్రజలకు మార్గదర్శకులుగా ఉంటూ మరిన్ని కొత్త మార్పులు తేవడానికి ప్రయత్నించేవారు రవీంద్ర దంపతులు.

రేషన్‌ షాపు పెట్టి...
అడిగేవాళ్లు లేకపోవటమూ అడవుల్లో ఎక్కడో దూరంగా ఉండటంతో బైరాగఢ్‌ ప్రజలకు రేషన్‌ అందేది కాదు. ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసి గ్రామాలన్నిటికీ రేషన్‌ సరకులు అందేలా చేశాడు రవీంద్ర. డీలరు బాధ్యతనీ తానే తీసుకుని ఎక్కడా అవకతవకలు జరగకుండా వచ్చిన సరకులు వచ్చినట్లు అందరికీ పంచేవాడు. సమయానికి రేషన్‌ అందడమూ, పంటలూ కూరగాయలూ బాగా పండటంతో పోషకాహారం సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే తాను ఒక్కడే మూడువందల గ్రామాలకు వైద్య సేవలు అందించడం సాధ్యం కాకపోవడంతో ఆయా గ్రామాల జనాభాను బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల వెంటబడ్డాడు రవీంద్ర. అప్పటికే కొన్నేళ్లుగా అతడు అక్కడ సేవలు అందించడం గురించి విన్న అధికారులు త్వరగానే స్పందించారు. క్రమంగా ఆ గ్రామాలన్నిటికీ కలిపి 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ప్రజలు వాటిని వినియోగించుకునేలా చూడడమే కాక తన అనుభవంతో అక్కడి వైద్యులకు సలహాలూ సూచనలూ ఇస్తున్నాడు రవీంద్ర. వ్యాధినిరోధక టీకాలూ, గర్భం దాల్చినప్పటినుంచి బిడ్డకు ఐదేళ్లు నిండేవరకూ తల్లీబిడ్డలు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెబుతూ వాళ్లు అనుసరించేలా చూడడం వల్ల పరిస్థితి ఎంతగానో మెరుగయ్యింది. రవీంద్ర వెళ్లక ముందు వెయ్యి మంది పిల్లలు పుడితే అందులో రెండువందల మంది మొదటి ఏడాదిలోనే చనిపోయేవారు. ఐదేళ్లు నిండేలోపు మరో 400 మంది చనిపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఏడాది లోపు శిశుమరణాల సంఖ్య నలభైకి తగ్గింది

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణవైద్యం చేస్తారు కానీ కంటి వైద్యం, దంతవైద్యం లాంటి సౌకర్యాలు ఉండవు. అందుకని కంటివైద్యుడైన స్నేహితుడు ప్రేమ్‌చంద్‌ పండిట్‌తో కలిసి పక్క ఊళ్లో ‘ప్రేయర్‌ ఐ’ హాస్పిటల్‌ని ఏర్పాటుచేశాడు రవీంద్ర. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించి ఆస్పత్రికి కావాల్సిన యంత్రాలను కొన్నారు. శని, ఆదివారాలు అక్కడ కంటివైద్య శిబిరాలు ఏర్పాటుచేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

ఇల్లు వద్దని...
ఒకసారి రాష్ట్ర మంత్రి ఒకరు బైరాగఢ్‌ వచ్చారు. స్థానికుల కోరిక మీద రవీంద్రను కలవడానికి వచ్చిన ఆయన వారు ఉంటున్న పూరి పాకను చూసి ఆశ్చర్యపోయారు. తాను వారికి మంచి ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. వెంటనే స్మిత తమకు ఆ ఇల్లు చాలనీ, ఆ డబ్బుతో పల్లెలకు రోడ్లు వేయించమనీ మంత్రిని కోరారు. ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మేల్ఘాట్‌లోని అన్ని పల్లెలకూ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. బస్సులు తిరుగుతున్నాయి. కరెంటు వచ్చింది. దాదాపు అన్ని ఊళ్లల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
యువతతో గడపటాన్ని ఇష్టపడే రవీంద్ర వారి ఆశల్నీ, కలల్నీ తెలుసుకుని ప్రోత్సహిస్తుంటాడు. ఊరి సమస్యల గురించి కూడా వారిలో అవగాహన పెంచాలని ప్రతి ఊళ్లోనూ యువజనసంఘాలను ఏర్పాటుచేసి తరచూ వారితో సమావేశమయ్యేవాడు. ఎప్పుడూ పండించే పంటలే కాకుండా కొత్త పంటలు పండించడం ఎందుకు మంచిదో, మిశ్రమ సాగు లాంటివి భూసారాన్ని ఎలా పెంచుతాయో వివరించేవాడు. తిండి గింజలకోసమే కాక దిగుబడి పెంచి అమ్ముకోవాలని ఆ గిరిజనులకు నేర్పించేవాడు. అడవుల సంరక్షణ, పర్యావరణాన్నీ వనరుల్నీ కాపాడుకోవడం, ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడం- లాంటి విషయాలపై వారికి తెలియని విషయాలు చెప్పేవాడు. ఆ ప్రాంత వాతావరణ పరిస్థితుల్ని బాగా అధ్యయనం చేసిన రవీంద్ర ఎలాంటి పంటలు వేస్తే మంచిదో రైతులకు సూచిస్తుంటాడు. దాంతో మేల్ఘాట్‌ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలే లేవు. ముప్ఫై అయిదేళ్లుగా ఈ దంపతులు చేస్తున్న నిర్విరామ కృషిని గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది ఇద్దరినీ ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది.

పిల్లలదీ పల్లెబాటే!

వీంద్ర, స్మిత దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిని పల్లె బడిలోనే చదివించారు. పై చదువులకు వచ్చాక పట్టణానికి పంపించారు. పెద్దబ్బాయి రోహిత్‌ వ్యవసాయశాస్త్రం చదివి బైరాగఢ్‌లోనే రైతుగా స్థిరపడ్డాడు. సోయా పంటని మేల్ఘాట్‌కి పరిచయం చేసిన రోహిత్‌ సాగును లాభదాయకంగా మార్చుకోవడం ఎలాగో రైతులకు నేర్పిస్తున్నాడు. అతడిని చూసి ఎందరో యువకులు వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కొత్త పంటలు పండిస్తున్నారు. అమ్మానాన్నల అడుగుజాడల్లో నడవాలనుకున్న రెండో అబ్బాయి రామ్‌ మెడిసిన్‌ చదివాడు. పల్లెల్లో ఎంతగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నా శస్త్రచికిత్సలు చేసే నిపుణుడి స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి సర్జరీలో స్పెషలైజేషన్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు రామ్‌. తల్లిదండ్రుల నిరాదరణకు గురై రోడ్డున పడ్డ ఓ ఆడపిల్లను అక్కున చేర్చుకుని పెంచుతున్నారు స్మిత. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్‌ చదువుతోంది.

ఇదీ చూడండి: కాళ్లతో కుంచె పట్టి గెలుపుకథ రాసుకుంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.