విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కుమారుడు వశిష్టపై వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. వశిష్ట భార్య సింధు శర్మ ఫిర్యాదుతో హైదరాబాద్లోని సీసీఎస్ మహిళా పోలీసులు ఐపీసీ 498-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచార నివేదికలో వశిష్టతో పాటు జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, ఆయన భార్య జయలక్ష్మి పేర్లను కూడా చేర్చారు. ఈనెల 21న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిత్ర హింసలకు గురి చేస్తున్నారు
తనను భర్త వశిష్ట చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సింధు శర్మ ఆరోపించారు. గాయాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు పిల్లలను తన నుంచి దూరం చేశారని అన్నారు. తనను మానసిక వికలాంగురాలిగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అదనపు కట్నం కోసం అత్త మామలు వేధిస్తున్నారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు
వశిష్ట, సింధుశర్మలకు మహిళా పోలీసు స్టేషన్లో అధికారులు రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆరు రోజుల క్రితం తనను దారుణంగా చిత్రహింసలు పెట్టినట్లు గాయాలు చూపించడం వల్ల వశిష్ట, అతని తల్లిదండ్రులపై ఐపీసీ 498-ఏ, 406, 323 సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఇన్ స్పెక్టర్ మంజుల తెలిపారు.
సింధుశర్మను దుర్భాషలాడుతూ.. ప్రతిరోజు కొడుతున్నట్లు తమకు చెప్పారని సీఐ తెలిపారు. చట్ట ప్రకారం విచారణ జరుపుతామని అన్నారు.
ఇదీ చదవండి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం