హైదరాబాద్ సాహెబ్‌నగర్ పద్మావతీ కాలనీలోని మ్యాన్‌హోల్‌లో పూడిక తీత పనులు చేస్తూ మరణించిన.. ఇద్దరు జీహెచ్ఎంసీ ప్రైవేటు కార్మికుల కుటుంబీకులకు జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసింది. ఇళ్ల మంజూరు పత్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి వారికి అందించారు.
ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లో పూడిక తీత పనులు చేసేందుకు రాత్రి సమయంలో దిగారు. ప్రమాదవశాత్తు వారిద్దరూ అందులో నీటిలో మునిగి మృతిచెందారు. ఈ మేరకు మృతులు శివ భార్య ధరణి శ్రావణ గౌరి, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మను మేయర్ పరామర్శించారు. రెండు పడక గదుల ఇళ్ల మంజూరు పత్రాలను ఈ సందర్భంగా వారికి అందించారు.
వనస్థలిపురం రైతు బజార్ జై భవానీ నగర్ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లలో 702 నంబర్ ఇంటిని శ్రావణ గౌరికి, 701 నంబర్ ఇంటిని భాగ్యమ్మకు కేటాయించారు. ఇప్పటికే వీరికి ఒక్కొక్కరికి రూ. 17 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని జీహెచ్ఎంసీ అందించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: KTR: 'అంబేడ్కర్ ఆశయాల దిశగా తెరాస పాలన'