భాగ్యనగరంలోని ప్రధాన ప్రాంతాలు సహా పాతబస్తీ, చిక్కడపల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కాచిగూడ, విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో కుక్కల సంచారం ఎక్కువగా ఉంటోందని బాధితులు చెబుతున్నారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయాలతో చనిపోయారు. ఒక కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలిగేలా చర్యలు చేపట్టడం, ప్రమాదకరంగా ఉన్న శునకాలను జీహెచ్‌ఎంసీ వేర్వేరు ప్రాంతాలకు తరలించడం వంటివి చేయాలని చోదకులు కోరుతున్నారు.
అనూహ్యం... భయం...
వాహనచోదకులు శునకాలను చూడగానే కంగారు పడటం, భయంతో వేగం పెంచడం లేదా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం చేస్తున్నారు.రహదారులపై పడిపోతున్నారు.
- సుల్తాన్‌బజార్ పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు కొద్ది రోజుల క్రితం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా చాదర్‌ఘాట్ వద్ద అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడ్డాడు. మలక్‌పేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- కాలాపత్తర్ ఠాణా కానిస్టేబుల్ మహేందర్ కుమార్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కార్వాన్ హరా దర్వాజ వద్ద ఎదురుగా కుక్క రావడం వల్ల ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడి గాయాల పాలయ్యారు. కుల్సుంపుర పెట్రోలింగ్ పోలీసులు మహేందర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
- శాలిబండ పోలీస్ ఠాణా హోంగార్డు సత్యానంద్ ఈనెల 23న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్క అడ్డు రావడం వల్ల కిందపడిపోవడంతో గాయాల పాలయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడం వల్ల ఈనెల 26వ తేదీన మృతి చెందాడు.