Insects in Government Hospitals: ఓ వైపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పెరుగుతున్నా.. రోగులకు, వారి సహాయకులకు వసతులు కల్పించడంలో మాత్రం వైద్యఆరోగ్యశాఖ విఫలమవుతోంది. ఉస్మానియా, గాంధీల్లో వార్డుల్లోనే కుక్కలు తిరగడం, పిల్లులు పడకేయడం, నిమ్స్‌లో బొద్దింకలు, నల్లులు స్వైరవిహారం చేయడం సాధారణమైపోయింది. పారిశుద్ధ్యం, భద్రత ఏర్పాట్లతో పాటు ఆసుపత్రుల్లో కీటకాల నాశనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా.. సరిగా అమలుకావడం లేదు. దోమలు, ఈగలు, నల్లులతో రోగులు, సహాయకులు అవస్థలపాలవుతున్నారు.
వరంగల్ ఎంజీఎంలో.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు దారుణంగా కొరికేయడం దవాఖానాల్లో భద్రత డొల్లకు దర్పణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ నలువైపులా కొత్తగా 4, వరంగల్‌లో ఒకటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను, వచ్చే రెండేళ్లలో 16 వైద్య కళాశాలలను నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తవి నిర్మించడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా.. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో కనీస వసతుల కల్పనపైనా దృష్టిపెట్టడం అంతకంటే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, భద్రతకు సిబ్బందిని నియమించినా.. వారి సంఖ్య సరిపోవడం లేదు. 100 మంది పని చేయాల్సిన చోట 40 మందే ఉండటం గమనార్హం.
ఎంజీఎం, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు సహా అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ పారిశుద్ధ్యం లోపించింది. ముఖ్యంగా మరుగుదొడ్లు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్నాయి. రోజుకు మూడుసార్లు శుభ్రపరచాల్సి ఉన్నా ఒక్కసారితోనే సరిపెడుతున్నారనే ఆరోపణలున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నిమ్స్‌లో అయితే నల్లులు, బొద్దింకలు రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ఐసీయూ వార్డులే ఎలుకలకు నిలయాలుగా ఉన్నాయంటే, సాధారణ వార్డుల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఆసుపత్రుల ప్రాంగణాల్లో కుక్కలు, పందులు తిరుగుతుంటాయి. హైదరాబాద్‌లోని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఆరుబయట పడుకునే రోగుల సహాయకులకు కుక్కలు, పిల్లులు, పందులతో అవస్థలు తప్పడంలేదు.
అప్పుడు శవాన్ని కొరికాయి.. ఇప్పుడు రోగిని!
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలే కాదు అప్పుడప్పుడు పాములు కూడా సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 2017 ఆగస్టులో ఆసుపత్రి శవాగారంలో ఎలుకలు ఒక మృతదేహాన్ని కొరికేశాయి. అప్పట్లో బంధువులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి భవనం చాలా పురాతనమైనది. పైగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి కాలువల్లోంచి ఎలుకలు వార్డుల్లోకి చేరుతున్నాయి. ఓపీ వైద్యవిభాగం మొదలు, అత్యవసర విభాగం, క్యాజువాలిటీ వరకు ఎటుచూసినా ఎలుకల స్థావరాలు, తోడిన మట్టికుప్పలు కనిపిస్తున్నాయి. స్పృహ లేని రోగులను కొరికేస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో వైర్లను కొరికేయడంతో ఎంఆర్‌ఐ స్కానర్ కొన్ని రోజులు పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆసుపత్రిలో మూషికాల సమస్యను శాశ్వతంగా నివారించాలంటే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. వరంగల్‌లో రూ. 1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నందున ఎంజీఎం సివిల్ పనులు చేపట్టడంలేదని సమాచారం.
* 2018లో వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మృతశిశువును ఎలుకలు తినడం అప్పట్లో సంచలనం రేపింది. ‘ఈనాడు’ వరస కథనాలు ఇవ్వడంతో ఆధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు.
* రెండేళ్ల కిందట ఎంజీఎం ఆసుపత్రిలో న్యూరాలజీ ఓపీ, ఫిజియోథెరఫి ఓపీ బ్లాక్‌లోకి పాములు వచ్చాయి.
* గతంలో ఇదే ఆసుపత్రి మార్చూరీలో శవాలను ఎలుకలు కొరక్కుతినటం సంచలనం సృష్టించింది.
ఇదీ చదవండి: MGM Hospital: దండిగా ఎలుకలు.. రోగుల్లో గుబులు