అసెంబ్లీ భవనం అవసరాలకు అనుగుణంగా లేదని భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి.
కొత్త రాష్ట్రం ఎందుకు నిర్మించుకోకూడదు..?
ఎర్రమంజిల్‌లో భవనాలు వారసత్వ కట్టడాల పరిధిలోనే ఉన్నాయని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నళిన్ కుమార్ వాదించారు. ఈ వాదనలు కొనసాగుతున్న సందర్భంలో ధర్మాసనం పిటిషనర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే తప్పేంటి? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పాత రాష్ట్రాలు కూడా కొత్త భవనాలు, నగరాలను నిర్మించుకుంటున్నాయి. అలాంటప్పుడు కొత్త రాష్ట్రం ఎందుకు నిర్మించుకోకూడదో వివరించాలని పేర్కొంది.
వారసత్వ కట్టడాలపై మరోసారి వాదనలు
హెచ్‌ఎండీఏ చట్టంలో ఉన్న నిబంధన 13ను తొలగించినందున ప్రస్తుతం అది వారసత్వ కట్టడాల పరిధిలోకి రాదని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదించారు. అసలు హెచ్‌ఎండీఏకు వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న వాటిని తొలగించే అధికారం ఉందో, లేదో చెప్పాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవాళ ధర్మాసనం ముందు ఉంచనున్నారు.
ఇవీ చూడండి: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ