రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ విభాగం పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎన్.ఎం.సి బిల్లుకి వ్యతిరేకంగా విధులు బహిష్కరించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే వైద్యులు సమ్మెలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని ఐఎంఏ భావించినప్పటికీ... దిల్లీలో పరిస్థితుల దృష్ట్యా సమ్మెను వాయిదా వేసింది. నిరసనలకు సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ముందుగా అనుకున్న ప్రకారమే సమ్మె చేపట్టాలని ఐఎంఏ తెలంగాణ శాఖ నిర్ణయించింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది.
సెలవులను కూడా రద్దు చేశారు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు... నేడు ధర్నా చౌక్‌లో వైద్య గర్జన చేపడుతున్నారు. ఉస్మానియా, గాంధీ సహా వివిధ బోధనాస్పత్రులకు చెందిన వైద్యులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణలో మొత్తం దాదాపు 5 వేల మందికి పైగా ఉన్న జూడాలు విధులకు దూరంగా ఉండనున్నారు. మరోవైపు జూడాలు, ఐఎంఏ సమ్మె పిలుపు మేరకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీతో పాటు అన్ని బోధనాస్పత్రుల్లో వివిధ శాఖల హెచ్ఓడిలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు, అసోసియేట్లు తప్పక విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గాంధీ ఆస్పత్రి వివిధ విభాగాల వైద్యుల సెలవులను కూడా రద్దు చేసినట్టు గాంధీ సూపరింటెండెంట్ ప్రకటించారు.
రోగులకు ఇబ్బందులు తప్పవు
మొత్తంగా ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా వైద్యులు చేస్తున్న ధర్నాలు నేడు తీవ్ర రూపం దాల్చనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు విధులను బహిష్కరించడం వల్ల రోగులకు తీవ్ర ఇబ్బందులు కల్గనున్నాయి.
ఇవీ చూడండి: తీర్పు రిజర్వ్: కూల్చడమా.. మిగల్చడమా?