ఊహ తెలిసేనాటికే పరిచయమైన సంగీతం... ఆ తరువాత అదే అతడి ఊపిరిగా మారింది. పదిమందికి సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష... అందరూ మెచ్చే డాక్టర్‌ను చేసింది. అంతుచిక్కని వ్యాధుల అంతు చూడాలనే ఆసక్తి... పరిశోధనల వైపు మళ్లించి.. డయాగ్నొస్టిక్ సెంటర్‌కు అధినేతను చేసింది. నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురికి పంచాలనే తపన అధ్యాపకుడిగా నిలిపింది. ఒత్తిడికి దూరంగా, ఆరోగ్యానికి చేరువగా ఉండాలనే కోరిక క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చింది. ఇలా నచ్చిన ప్రతి రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హైదరాబాద్ యువకుడు అభినవ్ గొల్ల.
ఓ వైపు వైద్యం... మరోవైపు సంగీతం
హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన అభినవ్... పాథాలజీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే... విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్నాడు. డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వహణలో తీరిక లేకుండా ఉండే ఈ యువ వైద్యుడు... గాయకుడిగానూ రాణిస్తున్నాడు. తన పాటలకు తనే సాహిత్యాన్ని సైతం సమకూర్చుకుంటూ... రచనలోనూ మెరుస్తున్నాడు. వైవిధ్యమైన గీతాలతో సంగీతాభిమానుల్ని అలరిస్తున్నాడు.
చిన్నతనం నుంచే...
అభినవ్... ఇప్పటివరకు దాదాపు 20 ఆల్బమ్స్ రూపొందించాడు. ఈ పాటలన్నింటికీ తనే సొంతంగా సాహిత్యం అందించాడు. తల్లి లక్ష్మీపార్వతి సంగీత టీచర్ కావటంతో చిన్నతనం నుంచి సరిగమలపై దృష్టి పెట్టాడు. అమ్మ ప్రోత్సాహంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. హిందూస్థానీ సంగీతంలోనూ పట్టు సాధించాడు. వైద్యుడిగా తీరిక లేకున్నా... సంగీతానికి ప్రత్యేక సమయం కేటాయిస్తూ గాయకుడిగా తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
విదేశాల సంగీతం
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అనేక పాటలు పాడిన అభినవ్... చైనీస్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వంటి విభిన్న దేశాల సంగీతాన్ని వింటూ... ఎప్పటికప్పుడూ తన ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనకున్న సమయాభావం వల్ల యూట్యూబ్‌లో నాన్ కాపీరైట్ ట్యూన్స్ తీసుకొని.. వాటికి అనుగుణంగా లిరిక్స్ రాసుకుంటూ... కొత్త పాటలకు ప్రాణం పోస్తున్నాడు. కేవలం ఒక జోనర్‌కు పరిమితం కాకుండా... మదిలో మెదిలే భావాలతో.. స్వరార్చన చేస్తున్నాడు అభినవ్.
క్రీడాకారుడిగానూ...
గాయకుడిగా, రచయితగా మెప్పిస్తున్న అభినవ్... క్రీడాకారుడిగానూ మెరిశాడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో సంగీతంతో పాటు బ్యాడ్మింటన్ సాధన చేశాడు. పాఠశాల, కళాశాల దశలో అనేక పోటీల్లో పతకాలు సొంతం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో సౌత్ జోన్ ఛాంపియన్ స్థాయికి చేరుకున్నాడు.
ఆత్మవిశ్వాసంతో...
పలు లఘు చిత్రాల్లోనూ అభినవ్ నటించాడు. పోలీస్ ఆఫీసర్, డాక్టర్ వంటి పాత్రలతో ఆకట్టుకున్నాడు. విభిన్న రంగాలను ఎంచుకున్నప్పుడు విమర్శలు ఎదురైనా... అభినవ్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మన ప్రతిభపై నమ్మకం, సాధించాలనే పట్టుదల ఉంటే ఎన్ని రంగాల్లోనైనా గెలుపు తీరం చేరవచ్చునని నిరూపిస్తున్న అభినవ్... సంగీత దర్శకుడిగా శ్రోతల్ని మెప్పించటమే తన లక్ష్యమంటున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదీ చదవండి: ఖమ్మం హత్యోదంతం : ప్రియురాలిపై మోజుతోనే హత్య!