Diwali Celebrations: దీపావళి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీపావళి పర్వదినాన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు పేల్చారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల టపాసులు కాల్చారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. తన క్యాంపు కార్యాలయంలో దీపావళి పండగను ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేక పూజల అనంతరం దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చారు. ఖమ్మంలోని తన నివాసంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చారు. హనుమకొండలో ఇంటిల్లిపాది టపాసులు పేల్చుతూ ఉత్సాహంగా గడిపారు. ఇంటి ముందు దీపాలతో అందంగా అలకరించారు.
దీపావళి వేళ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. నిర్మల్‌కు చెందిన ఓ వ్యాపారి దీపావళి వేళ అమ్మవారి పూజకు అలంకరణలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. తన వ్యాపార సముదాయంలో పండ్లు, పూలు, మిఠాయిలు, దీపాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్, కళ్యాణ్ నగర్ వెంచర్- 3లో అగ్ని ప్రమాదం జరిగింది. మోతీ నగర్‌లోని నోబుల్ అపార్ట్ మెంట్‌పై ఉన్న సెల్ టవర్.. విద్యుదాఘాతానికి గురైంది. బాణాసంచా కాల్చడం వల్ల సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు.. సనత్ నగర్ అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: