JC Prabhakar Reddy fire on DSP: తమ భూమిలో గుడిసెలు వేస్తున్న వారిని అడ్డుకున్నందుకు తమపై డీఎస్పీ చైతన్య ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఏపీలోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన జేసీ.. తాడిపత్రిలో తమ ఆస్తులను ఆక్రమించటానికి కొందరు ఎమ్మార్పీఎస్ సంఘాల నేతలను పంపుతున్నారని తెలిపారు. అడ్డుకుంటే తమపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాజకీయంగా అనేక అక్రమ కేసులు పెట్టిన డీఎస్పీ చైతన్య.. చాలా తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి తమ ఆస్తులను ఆక్రమించాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తన కుమారుడు అస్మిత్ రెడ్డికి సంబంధించిన భూమిని ఎమ్మార్పీఎస్ నాయకుల ద్వారా ఆక్రమింపచేయాలని డీఎస్పీ కుట్ర చేస్తున్నారన్నారు. చైతన్యపై చర్యలు తీసుకోకపోతే తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా ఎస్పీ, డీఐజీలను ఉద్దేశించి చెప్పారు.
తన భూమిని అక్రమించటానికి డీఎస్పీ చైతన్య ఏ విధంగా తొత్తుగా మారాడో.. తక్షణమే విచారణ చేయాలి. నేను తప్పు చేశానని విచారణలో తేలితే.. మీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉన్నా. జిల్లా ఎస్పీ, డీఐజీలకు సవాల్ చేస్తున్నా.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. తక్షణమే విచారణ చేయాలి. -జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఇవీ చదవండి :