కొత్త రెవెన్యూ విధానానికి సంబంధించిన బిల్లులపై శుక్రవారం శాసనసభలో కీలక చర్చ జరగనుంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకంగా ప్రజలకు సత్వర సేవలు అందేలా సంస్కరణలతో కూడిన రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వీఆర్వో వ్యవస్థ రద్దు, భూమిహక్కులు-పట్టాదారు పాసుపుస్తకాలు, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి. ఆ బిల్లుల ఆమోదం కోసం శుక్రవారం శాసనసభలో చర్చ జరగనుంది. చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారు.
ప్రశ్నోత్తరాలు పూర్తికాగానే రెవెన్యూ బిల్లులపై చర్చ ఉంటుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గురుకులాలు, హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ పనులు, విదేశీవిద్యానిధి పథకం, జీహెచ్ఎంసీలో రహదార్ల విస్తరణ, లాక్ డౌన్ సమయంలో వలసకూలీలను ఆదుకోవడం, క్రీడాకారులకు సదుపాయాల అంశాలపై చర్చ జరగనుంది. కొవిడ్ వారియర్స్‌కు ప్రోత్సాహకాలు, విశ్వవిద్యాలయాలకు నిధులు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రైతువేదికలు, తెలంగాణ సోనా ధాన్యం అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చదవండి: అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ