Discounts on Traffic Challans Telangana 2023 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం వాహనదారులకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఏకంగా రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దీంతో ఇదే తరహాలో మరోమారు భారీ రాయితీ ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
Discount on Traffic Pending Challans in Telangana : తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెబుతున్నా వాహనదారులు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కవైపోతున్నాయి. రాంగ్ రూట్‌లో వెళ్లడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు గానూ వారిపై ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. కానీ వాహనదారులు మాత్రం చలాన్లు పడుతున్నా, వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు రాయితీ ఇచ్చారు.
Telangana E Challan Discount 2023 : సుమారు 70 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో చాలా మంది వారి పెండింగ్ చలాన్లను చెల్లించారు. ఇప్పుడు తాజాగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు భారీగా రాయితీ ప్రకటించింది. గతంలో కంటే ఈసారి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం, ద్విచక్ర వాహనాల చలాన్లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.
పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్‌ల వివరాలు :
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్
- ద్విచక్రవాహనాల చలాన్లపై 80 శాతం డిస్కౌంట్
- ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం డిస్కౌంట్
- లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, చలానాలు విధించడం సులభమైంది. ఈ చలానాలను చాలా మంది చెల్లించడం లేదు. అయితే పోలీసులు తనిఖీలు నిర్వహించి, వాహనం నంబరు ఆధారంగా చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఐదుగురు పిల్లలతో బైక్పై తండ్రి ప్రయాణం- ఆసుపత్రిలో ఆరో కుమారుడు- పోలీసులకు ఫన్నీ సమాధానం
Discount on Telangana E Challan 2023 : మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ప్రకటించారు. ఈ క్రమంలో దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ చలాన్లు వసూలయ్యాయి. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా పెండింగ్ భారం పెరిగిపోయింది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం