Discoms on Electricity charges: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపెంపునకు రంగం సిద్ధమవుతోంది. రుసుముల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) డిస్కమ్‌లు ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ మేరకు ఈఆర్‌సీకి డిస్కమ్‌లు ఏడాది ఆదాయ వార్షిక నివేదికతోపాటు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి. అన్నిరకాల గృహ విద్యుత్ వినియోగదారులకు యూనిట్‌కి 50 పైసల చొప్పున పెంచాలని కోరాయి.
గృహ విద్యుత్ కాకుండా మిగిలిన వారందరికి యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచేందుకు అనుమతివ్వాలని ఈఆర్సీని కోరాయి. వివిధ వర్గాల నుంచి ప్రజాభిపాయసేకరణ నిర్వహించిన తర్వాత ఛార్జీల పెంపుపై ఈఆర్సీ అనుమతి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సబ్సిడీలు కొనసాగుతాయని సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
'యాభై పైసలు మాత్రమే గృహ వినియోగదారులకు యూనిట్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పెంపుతో రూ.2110 కోట్లు ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. మిగిలిన వినియోగదారులకు ఒక రూపాయి పెంచుతున్నాం. గత ఐదేళ్లలో ఛార్జీలు పెంచలేదు. అన్ని స్లాబుల్లో టారిఫ్‌లు పెంచడం వల్ల రూ.4721 కోట్లు అదనంగా వస్తుందని అంచనా వేస్తున్నాం. రైతులకు ఎప్పటిలాగే ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లకు వరకు ఉచితంగానే ఇస్తున్నాం. హెయిల్ సెలూన్స్, లాండ్రీలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కొనసాగిస్తాం. పవర్ లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్‌కు యూనిట్‌కు రెండు రూపాయల సబ్సీడీ కొనసాగుతుంది.' - రఘుమా రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ