Ktr Birthday Song: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. ప్రజల కోసమే తన పరిశోధన, పరిశీలన, పరిపాలన అని ప్రముఖ సినీ దర్శకుడు నిమ్మల శంకర్ అన్నారు. రేపు కేటీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌పై రూపొందించిన గేయంతో కూడిన వీడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ గేయ రూపకల్పనకు ఉగ్గం రాజేష్ యాదవ్ నిర్మాతగా వ్యవహరించగా.. రచన, గానం, సంగీతం మాట్ల తిరుపతి సమకూర్చారు.
ఐటీ రంగంలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని దర్శకుడు శంకర్ తెలిపారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలంతా హైదరాబాద్ వైపు చూస్తుండటమే కాకుండా.. టాప్ 5 కంపెనీల్లో మూడు సంస్థలను రప్పించిన ఘనత కేటీఆర్‌దేనని కొనియాడారు. నిర్మాణ రంగం, స్తిరాస్థి వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. చైన్నై, బెంగళూరు నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని.. అదే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఇతర భాషా చిత్ర ప్రముఖులు తనతో చెబుతున్నారని తెలియజేశారు.
వచ్చే సంవత్సరం పుట్టిన రోజు నాటికి కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నామని శంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ, మల్లెపల్లి మోహన్, తెరాస రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట నాగన్న తదితరులు పాల్గొన్నారు
ఇవీ చదవండి: కేటీఆర్ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి.. అభిమానుల్లో నిరుత్సాహం..
'పక్షపాత రాజకీయాలు వద్దు.. గాంధేయవాదమే మేలు'.. వీడ్కోలు ప్రసంగంలో కోవింద్