దిల్లీ తర్వాత అత్యధికంగా రాష్ట్రంలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స అందించామని తెలిపారు. ప్రస్తుతం 6,556 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించారు. గాంధీ, ఫీవర్, కింగ్ కోఠి, చెస్ట్ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 4 ఆస్పత్రుల్లో 2,501 పడకలు అందుబాటులో ఉన్నాయని.. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
నేచర్ క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వెయ్యి మందికి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. అవసరమైన వారికి టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. వీడియో కాల్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌లోనే ముందు జాగ్రత్తలు చేపట్టిందని... ల్యాబ్‌లు, ఆస్పత్రులు ముందుగానే సిద్ధం చేసుకున్నామని వివరించారు. రోజుకు 6,500 కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల కోసం 23 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.
కరోనాపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని... ప్రజలు 104, 108 కాల్ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. జూన్‌లోనే 13,534 కరోనా కేసులు నమోదయ్యాయని... ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇతర వ్యాధులు ఉన్నవారిలోనే మరణాలు ఎక్కువ ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లా ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ సరఫరా పెంచుతున్నామని వెల్లడించారు. పరీక్షల కోసం త్వరలో మరిన్ని పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో సమాచారం సరిగా లేదని గుర్తించినట్లు వివరించారు.
ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సరిగా పరీక్షలు చేయని.. తప్పుడు నివేదికలు ఇచ్చిన 13 ల్యాబ్‌లకు నోటీసులిచ్చామని చెప్పారు. నిన్నటి వరకు 50 వేల కరోనా పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లకు 8 వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని.. అంతకంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పరీక్షలు చేస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ