Hawk eye Telangana police app : ఎస్‌వోఎస్ (సేవ్ అవర్ సోల్స్).. అత్యవసర సమయాల్లో తక్షణ సాయం పొందేందుకు సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉండే మీట ఇది. తెలంగాణ పోలీసుల ‘హాక్ ఐ’ అప్లికేషన్ ద్వారా ఇది ప్రజలకు మరింత చేరువైంది. ఈ మీట నొక్కితే వెంటనే ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందేలా ఈ యాప్‌లో సదుపాయం ఉండేది. ఇప్పటికే 29 లక్షల మంది వినియోగిస్తున్న హాక్ ఐ యాప్‌లో త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నేరుగా డయల్ 100 కేంద్రానికే సమాచారం చేరేలా మార్పు చేస్తున్నారు. దీనివల్ల బాధితులకు వేగంగా సహాయం అందే అవకాశం రానుంది. దిల్లీ పోలీసుల ‘లాస్ట్ రిపోర్ట్’ యాప్ తర్వాత దేశంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న పోలీస్ యాప్ ‘హాక్ ఐ’. ప్రస్తుతం దానిలోని ఎస్‌వోఎస్ బటన్ ద్వారా స్థానిక పోలీసు యూనిట్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌కు మాత్రమే సమాచారం అందుతోంది. అక్కడి నుంచి స్థానిక పోలీసులకు, తర్వాత సమీప గస్తీ వాహన సిబ్బందికి ఆ సమాచారం చేరుతోంది. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడం, బాధితులకు సకాలంలో సహాయం అందిందా? సిబ్బంది సరిగా స్పందించారా? అనే వివరాలు సరిగా నమోదు కాకపోవడంతో ఈ ఫీచర్‌ను విస్తృతం చేయనున్నారు. రాష్ట్రపరిధిలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ మీట నొక్కితే నేరుగా డయల్ 100 కేంద్రానికి సమాచారం వెళ్లేలా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
1000 పెట్రోలింగ్ కార్లు.. 2100 బ్లూకోల్ట్స్ అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 పెట్రోలింగ్ కార్లు, 2100 బ్లూకోల్ట్స్ వాహనాలున్నాయి. వీటన్నింటి సమాచారం డయల్ 100 కేంద్రంలో నిక్షిప్తమై ఉంది. జీపీఎస్ సాంకేతికతతో అవి ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో తెరపైనే కనిపిస్తుంది. దీంతో డయల్ 100 కేంద్రం నుంచి నేరుగా సంఘటనాస్థలికి సమీపంలోని గస్తీ వాహన సిబ్బందికే సమాచారం అందించి జాప్యాన్ని నివారించాలన్నది లక్ష్యం. ఓలా, ఉబర్ యాప్‌ల్లోని ఎస్‌వోఎస్ మీటల్ని నొక్కినా డయల్ 100కే సమాచారం వెళ్లేలా అనుసంధానం చేశారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యవసర నంబరు 112కు తెలంగాణ పరిధి నుంచి వెళ్లే ఎస్‌వోఎస్ సందేశాలు, కాల్స్‌నూ డయల్ 100కు అనుసంధానించారు. ఎస్‌వోఎస్ తరహాలోనే ‘ఐయామ్ ఇన్ ఎమర్జెన్సీ’ అనే సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) పంపించడం ద్వారా అత్యవసర సహాయం పొందే సాంకేతిక పరిజ్ఞానాన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.