ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటలకు బీమా చేసుకునే సదుపాయం లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. గతేడాది వరకూ ప్రభుత్వ రాయితీలతో ఈ పథకాన్ని అమలు చేసిన ప్రైవేటు బీమా కంపెనీలు ఈ ఏడాది సర్కారు ముందుకు రాలేదని మిన్నకుండిపోయాయి. బీమా పథకాన్ని ఈ సీజన్ నుంచే ప్రభుత్వం నిలిపివేసింది. వాస్తవానికి ప్రైవేటు బీమా కంపెనీలు సొంతంగా అమలు చేయడానికి అవకాశమున్నా స్పందించలేదు. ప్రస్తుత సీజన్‌లో జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) ఒక్కటే పరిమితంగా పత్తి, మిరప పంటలకు సొంతంగా బీమా పథకాన్ని అమలుచేసింది. ఎక్కువ మంది రైతులకు ఈ బీమా పథకం గురించి తెలియక ప్రీమియం సొమ్మును చెల్లించలేదు.
ఊరట కరవు
పంటల బీమాలో రెండు పథకాలున్నాయి. సాధారణ ఆహార, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు ‘ప్రధానమంత్రి పంటల బీమా’, పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి, టమాటాలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కేంద్రం అమలుచేస్తోంది. గతేడాది వరకూ రెండు పథకాలను తప్పనిసరిగా రాష్ట్రాలు అమలుచేయాలంటూ కేంద్ర సర్కారు నిబంధన ఉండేది. ఈ సీజన్ నుంచి రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది. బ్యాంకులు రైతుల ఇష్టం లేకుండా ప్రీమియం మినహాయించవద్దని కేంద్రం ఈ సీజన్‌కు ముందు ఆదేశాలిచ్చింది.
ప్రధానమంత్రి పంటల బీమా ప్రకారం ఒక పంట విలువలో 2 శాతం మాత్రమే రైతు ప్రీమియంగా చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ ప్రీమియం ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలి. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. గత 3 నెలలుగా రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 3 లక్షల ఎకరాల్లో పంటలు ముంపున పడ్డాయి. గత వారంలోనే 40 వేల ఎకరాలకు పైగా నీటమునిగాయి. బీమా లేకపోతే ఇలాంటి పరిస్థితులకు పరిహారం ఏమీ వచ్చే అవకాశం లేక నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు.
ఇదీ చదవండి : అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..