Teachers Darna near assembly: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతల వారీగా ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. బిర్లా మందిర్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయలను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేస్‌మాస్క్ ధరించిన ఉపాధ్యాయుల నుంచి మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఉపాధ్యాయులు వేడుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయుల అలోకేషన్ చేసేటప్పుడు స్థానికత అంశాన్ని విస్మరించారని తెలిపారు. టీచర్స్ని తమ సొంత జిల్లాలను బలవంతంగా వదిలి ఇతర జిల్లాలకు శాశ్వతంగా పంపించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికత పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో స్థానికతకు చోటు లేకుండా పోయిందని మండిపడ్డారు. వందల కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి దూరం అవుతున్నామని.. మా పిల్లలు భవిష్యత్తులో స్థానికత విషయంలో తీవ్ర అన్యాయం జరగబోతోందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని.. స్థానిక జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా 317 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు ఏంటి జీఓ 317: 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 10 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. తరవాత వాటిని మొదట 31 జిల్లాలు చేశారు. ఆ తరువాత 33 జిల్లాలుగా ప్రకటించారు. ఇలా జిల్లాలుగా విడగొట్టినప్పుడు కొంత మంది ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బదిలీ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. విభజన తరువాత కొత్తగా కొన్ని జోన్లు, మల్లీ జోన్లు ఏర్పాటు చేశారు. దీని వలన కొంత మంది ఉద్యోగులు తమ స్థానిక జిల్లాలో ఉన్న అనుభవాన్ని కొల్పోయారు. 317జీఓలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్లకి బదిలీ అయ్యే అవకాశం ఇచ్చింది. దీంతో చాలా మంది ఉపాధ్యాయులు తమ అవకాశాన్ని కోల్పాయారు. అందువల్ల ఈ జీఓను రద్దు చేయాలని ఉపాధ్యాయుల సంఘం గతంలో చాలా సార్లు ధర్నాలు చేపట్టారు.
ఇవీ చదవండి: