Dharmapuri Srinivas hospitalized: హైదరాబాద్‌లో సీనియర్ నేత డి.శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను బంజారాహిల్స్ సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ రోజు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ ఓనమాలు దిద్దారు. 1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన డీఎస్ రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఉన్నప్పుడే ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2004-2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. హస్తం పార్టీలోనూ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆయన.. కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే డీఎస్ రాజ్యసభ పదవి వరించింది.
అనంతరం కొన్ని పరిణామాలవల్ల డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగింది. 2019లో డీఎస్ కుమారుడు అర్వింద్ నిజామాబాద్‌లో కవితపై గెలుపొందడంతో దూరం కాస్త మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని డీఎస్ నిర్ణయించుకున్నారు. దీంతో ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం సాగుతోంది.
ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరో కుమారుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీలో ఉన్నారు. తన తండ్రి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని గతంలో అర్వింద్ వెల్లడించారు.
ఇవీ చదవండి: