ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండకపోతే మహారాష్ట్ర పరిస్థితే మనకూ వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టలేదంటే పరిస్థితి తీవ్రంగా లేదని కాదన్న ఆయన.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రుల్లో పడకల కొరత వస్తుందన్నారు.
ఈ సందర్భంగా గతంతో పోలిస్తే వైరస్ వేగంగా విస్తరిస్తోందని డీహెచ్ పేర్కొన్నారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే గంటల్లోనే మిగతా వారికీ వ్యాపిస్తోందని తెలిపారు. మరో 4-6 వారాలు పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న ఆయన.. ఇంట్లో ఉన్నా సరే మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించారు.