కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, వైద్యాధికారులు సహా వ్యాక్సినేటర్లతో డీహెచ్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సహా కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పీహెచ్‌సీలు సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం కావాలని డీహెచ్ సూచించారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దని పునరుద్ఘాటించారు. మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నందున వైరస్ బాధితుల ప్రైమరీ కాంటాక్టుల గుర్తింపు సహా నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతిరోజు కనీసం 50 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన ఆరోగ్య శాఖ.. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 2 వేల కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.