రాష్ట్రంలో డెల్టా వేరియంట్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ ఎక్కువగా వ్యాపిస్తున్న జిల్లాల్లో పర్యటిస్తున్నామని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించామన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారని... లాక్డౌన్లో నిబంధనలు పాటించినట్లే ఇప్పుడు పాటించాలని సూచించారు.
డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. మరో 2 నెలల వరకు ఇది కొనసాగుతుంది. గాలి ద్వారా డెల్టా వేరియంట్ సోకుతుంది. కాబట్టి ఇంట్లో కూడా అందరూ మాస్క్ ధరించాలి. ఒక వ్యక్తికి వైరస్ సోకితే ఇంట్లో వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ అంటున్నట్లు ప్రజలు సామాజిక బాధ్యతను విస్మరిస్తే మూడో దశ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. వరుస పండుగల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి.
-డీహెచ్ శ్రీనివాసరావు
వైరస్ పూర్తిగా డౌన్ కాలేదు..
రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. లాక్డౌన్ తీసేశాము అంతే ఇంకా వైరస్ పూర్తిగా డౌన్ కాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నా సరే జాగ్రత్తలు పాటించాలి. నాలుగు, ఐదు జిల్లాల్లో వైరస్ ప్రభావం ఉంది. దీనిని అదుపు చేయకపోతే మూడో వేవ్ వచ్చే ఆస్కారం ఉంది. లాక్డౌన్ తరువాత ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి బయటే ఎక్కువ తిరుగుతున్నారు. ఇలానే కొనసాగితే కేసులు పెరుగుతాయి. బోనాల జాతరలో ఎవరూ మాస్క్ ధరించడం లేదు. బక్రీద్ సమయంలో కూడా నిబంధనలు పాటిస్తారని అనుకోవడం లేదు. కానీ ప్రజలు మాస్క్ కచ్చితంగా ధరించాలి. థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం. 27 వేల బెడ్లు సిద్ధం చేయబోతున్నాము. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ బెడ్స్ సిద్ధం చేశాము. అయినా సరే.. పండగ సమయాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
-డీఎంఈ రమేశ్ రెడ్డి
కరోనా కట్టడిపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని డీహెచ్ తెలిపారు. పండుగల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. రెండు లేదా మూడు నెలలు సెకండ్ వేవ్ కొనసాగే అవకాశముందని హెచ్చరించారు. మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొన వద్దని... మాల్స్‌కి గుంపులుగా వెళ్లడం సరికాదని డీహెచ్ సూచించారు.