సైబర్ నేరాలు, చట్టాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆన్లైన్ తరగతులతోపాటు పలు అంశాలను తెలుసుకోవడానికి విద్యార్థులు అంతర్జాలాన్ని ఆశ్రయిస్తున్నారని... వారు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న "సైబ్-హర్" మూడో విడత కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలలకు చెందిన 850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకున్న తర్వాత మిగతా విద్యార్థులకు వీటి గురించి వివరించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని డీజీపీ సూచించారు. యంగిస్థాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "సైబ్-హర్" శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో ఎంపిక చేసిన విద్యార్థులకు 10 నెలల పాటు సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: Hydro electricity: రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన జలవిద్యుదుత్పత్తి