Telangana Annual Crime Report 2022: మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా పోలీసులు ఈ ఏడాది విజయవంతమయ్యారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. సరిహద్దు జిల్లాల్లోని పోలీసులు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. మతపరమైన ఘర్షణలు, ఉగ్రవాద దాడులు కూడా జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4 శాతం పెరిగిందని వెల్లడించారు. సైబర్ నేరాలు 57 శాతం పెరగడమే ఇందుకు కారణమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో హత్యలు 12 శాతం.. అత్యాచారాలు 17శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దొంగతనాలు 7 శాతం, అపహరణలు 15 శాతం పెరిగాయని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయని చెప్పారు. 152 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని వివరించారు. డయల్ 100 ద్వారా 13 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా 1.1 లక్షల ఫిర్యాదులు.. పోలీస్ స్టేషన్లలో 5.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా 15 లక్షల మందికి అవగాహన కల్పించామని తెలిపారు. గస్తీ వాహనాలు 7 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హాక్ ఐ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీజీపీ వెల్లడించారు.
సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేలిముద్రల ద్వారా ఎంతో మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. 10లక్షల మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించామని వివరించారు. కరుడు గట్టిన నిందితులపై పీడీ చట్టం ప్రయోగించి నేరాలు అదుపు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని చెప్పారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నిరంతరం పోలీసులు పనిచేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు.
"మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా పోలీసులు ఈ ఏడాది విజయవంతమయ్యారు. వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా వాటిని తిప్పికొట్టాం. రాష్ట్రమంతా ఉగ్రవాద చర్యలు లేకుండా నిఘాపెట్టాం. ఈ ఏడాది ఎక్కడా ఉగ్రఘటనలు జరగకుండా చూశాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షించాం. నేరాల శాతం 4.4 శాతం పెరిగింది. సైబర్ నేరాలు 57 శాతం పెరిగాయి." - మహేందర్‌రెడ్డి, డీజీపీ
ఇవీ చదవండి: న్యూయర్ వేడుకల్లో పాల్గొంటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే!
కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్.. వారందరికీ RTPCR రిపోర్ట్ తప్పనిసరి