సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా సివరేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అన్నారు. సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బస్తీలో రూ.40 లక్షల ఖర్చుతో కొత్త మంచి నీటి పైప్‌లైన్ నిర్మాణం పనులను మంగళవారం ప్రారంభించారు.
సికింద్రాబాద్ పరిధిలో నీటి సరఫరాను మెరుగు పరిచేందుకు కేవలం ఐదేళ్ల వ్యవధిలో మారేడుపల్లి, తార్నాక, శాంతినగర్ రిజర్వాయర్లను కొత్తగా నిర్మించామని చెప్పారు. సీతాఫల్మండి రిజర్వాయర్‌కు కొత్తగా బూస్టర్ ఏర్పాటు చేసి పంపింగ్ సామర్థ్యం పెంచామని ఆయన తెలిపారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటుతో బీదల బస్తీ, నామాల గుండు, మేడి బావి, ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడుతుందని అన్నారు. స్థానిక కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, జలమండలి జీఏం రమణ రెడ్డి, అధికారులు కృష్ణ, అన్విత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్