కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు అవలంభించాల్సిన విధానంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. పిల్లల పునరావాసం, ఉన్నత విద్యాభ్యాసంతో పాటు కొన్ని పొరుగు రాష్ట్రాల్లోలా ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. వివాహాలు జరిగి కుటుంబంతో స్థిరపడే వరకు ఆదుకునేలా అధికారులు నిబంధనలు రూపొందిస్తున్నారు.
అనాథల సంఖ్యపై ఆరా..
కరోనాతో అనాథలుగా మారిన పిల్లల సంఖ్యపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రానికి వచ్చిన అభ్యర్థనలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దాదాపు 190 మంది అనాథలుగా మారారని అంచనా వేసింది. సంఖ్యపై మరింత స్పష్టత కోసం శిశు సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. భార్య, భర్త ఇద్దరూ చనిపోయిన కుటుంబాల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ నుంచి తీసుకుంటోంది. ఈ నెల నాలుగో వారంలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నాటికి అనాథల సంఖ్యపై స్పష్టత రానుంది.