Cultivation of Vineyards: రాష్ట్రంలో ద్రాక్ష తోటల సాగు విస్తీర్ణం పెంచితే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఉద్యానశాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ పంట సాగుకు రాష్ట్రంలో అనువైన వాతావరణం, భూములున్నందున రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. 1990 ముందు వరకూ దేశంలోనే అత్యధిక నాణ్యమైన ద్రాక్షపండ్లు హైదరాబాద్ చుట్టుపక్కల 10 వేల ఎకరాల్లో పండేవి. స్థిరాస్తి, పట్టణీకరణ వల్ల ఈ పంట భూములన్నీ నిర్మాణాలకు, ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రస్తుతం పంట విస్తీర్ణం పదోవంతు కంటే తగ్గిపోవడంతో రాష్ట్ర వ్యాపారులు ఏటా రూ.200 కోట్ల విలువైన ద్రాక్షను మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పంట సాగు పెంచితే ఈ సొమ్మంతా రైతులకే వస్తుందని,అనుబంధ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుతో పలువురికి ఉపాధి లభిస్తుందని ఉద్యానశాఖ వివరించింది.
రాష్ట్రంలో సాగుకు అనుకూల ప్రాంతాలు..
తెలంగాణలో ప్రజలు తినడానికి వినియోగించే 31 వేల టన్నుల ద్రాక్షపండ్లు కావాలంటే 5,500 ఎకరాల్లో పంట సాగుచేయాలి. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లాలో 1500(ప్రస్తుతం 11 ఎకరాల్లో సాగు ఉంది), వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వెయ్యి ఎకరాల చొప్పున అదనంగా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలన్నది లక్ష్యం.
బిందుసేద్యంతో మెరుగైన దిగుబడి..
బిందుసేద్యం విధానంలో సాగునీరు, ఎరువులు అందించడం వల్ల 42 శాతం నీటి వినియోగం తగ్గించి దిగుబడి పెంచవచ్చని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనలో గుర్తించారు. ఈ పంట సాగుపెంపుపై ఈ వర్సిటీ శనివారం మేధోమథన సదస్సును రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కాలేజీలో నిర్వహిస్తోంది. దీనికి హాజరైన వారికి అక్కడే ఉన్న ద్రాక్ష తోటలను శాస్త్రవేత్తలు చూపించి సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు.
ఎకరానికి రూ. 3 లక్షల లాభం..
రాష్ట్రంలో ఈ పంట సాగుకు పుష్కలంగా అవకాశాలున్నాయని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఈ పంట సాగు వల్ల రైతులకు నికర ఆదాయం పెరుగుతుందని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే ఎకరానికి 21 టన్నుల దాకా దిగుబడి వస్తుందని ప్రయోగాల్లో గుర్తించామన్నారు. వాతావరణం అనుకూలించిన ఏడాది రైతులకు ఎకరానికి రూ.3 లక్షల దాకా లాభం వస్తున్నట్లు తెలిపారు.
విదేశాల ఆసక్తి..
తెలంగాణలో పండే ద్రాక్షలను కొనడానికి నెదర్లాండ్స్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.